Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook

శ్రీ సాయి సత్ చరిత్రము
ముప్పదియొకటవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 31

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదియొకటవ అధ్యాయము

(ఐదవదినము పారాయణము - సోమవారము)

బాబా సముఖమున మరణించినవారు

1. సన్యాసి విజయానంద్, 2. బాలారామ్ మాన్ కర్, 3. నూల్కర్, 4. మేఘశ్యాముడు, 5. పులి.

ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితోపాటు ఒక పులికూడ మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంతు వర్ణించు చున్నాడు.

ప్రస్తావన

మరణకాలమున మనస్సునందున్న కోరికగాని యాలోచనగాని వాని భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5, 6 శ్లోకములలో శ్రీకృష్ణు డిట్లు చెప్పియున్నాడు. "ఎవరయితే వారి యంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరయితే యేదో మరొక దానిని ధ్యానించెదరో, వారు దానినే పొందెదరు." అంత్యకాలమందు మనము మంచి యాలోచనలే మనస్సునందుంచుకొన గలమని నిశ్చయము లేదు. అనేకమంది అనేక కారణములవల్ల భయపడి యదరి పోయెదరు. కావున అంత్యసమయమందు మనస్సును నిలకడగా నేదో మంచియోలోచనయందే నిలుపవలె నన్నచో నిత్యము దాని నభ్యసించు టవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తియందుంచుకొని యెల్లప్పుడు భగవన్నామస్మరణ చేసినచో, మరణకాలమందు గాబరా పడకుండ ఉండగలమని యోగీశ్వరులందరు మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్యశరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి, యంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని యిచ్చట చెప్పెదము.

1. విజయానంద్

విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానససరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారమునుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలిసికొనెను. మానససరోవరపు యాత్రగూర్చి వివరములను కనుగొనెను. ఆ స్వామి సరోవరము, గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదనియు ప్రయాణమున కలుగు కష్టము లన్నిటిని వర్ణించెను. మంచు యెక్కువనియు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయనైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగువానిని జెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశచెంది యాత్రను మానుకొనెను. అతడు బాబావద్దకేగి సాష్టాంగనమస్కారము చేయగా బాబా కోపగించి యిట్లనెను. "ఈ పనికిరాని సన్యాసిని తరిమి వేయుడు. వాని సాంగత్యము మన కుపయుక్తము గాదు." సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నిటిని గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరసి యుండెను. వారు బాబాను అనేకవిధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదముల కభిషేకము చేయుచుండిరి. వారి బొటనవ్రేలునుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమున కత్తరు చందనములను పూయుచుండిరి. జాతిమత భేదములు లేక యందరును, సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికి, అతనికి బాబాయందు ప్రేమ కలిగెను. కావున నాతనికి ఆస్థలము విడిచి పెట్టుట కిష్టము లేకుండెను.

అతడు షిరిడీలో రెండు రోజు లుండినపిమ్మట తల్లికి జబ్బుగా నున్నదని మద్రాసునుండి ఉత్తరము వచ్చెను. విసుగుచెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా యాజ్ఞలేనిదే షిరిడీ విడువలేకుండెను. ఉత్తరము తీసికొని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా యాజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా, ముందు జరుగబోవునది గ్రహించి "నీ తల్లిని అంతప్రేమించువాడవయితే, సన్యాసమెందుకు పుచ్చుకొంటివి? కాషాయవస్త్రములు ధరించువానికి దేనియందభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగ కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియవేసికొని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయెదరు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలిసికొని నీ కర్తవ్యమును జేయుము, ఇహలోక పరలోక వస్తువు లన్నిటియందు గల యభిమానమును విడిచి పెట్టుము. ఎవరయితే ఈ ప్రకారముగ జేసి హరియొక్క పాదములను శరణు వేడెదరో, వారు సకలకష్టములనుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే ప్రేమభక్తులతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో, వారికి దేవుడు పరుగెత్తిపోయి, సహాయము చేయును. నీ పూర్వపుణ్య మెక్కువగుటచే నీ విక్కడకు రాగలిగితివి. నేను చెప్పినదానిని జాగ్రత్తగ విని, జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడవై, రేపటినుండి భాగవతమును పారాయణ చేయము. శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టిజెంది నీ విచారములను దొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును" అనిరి. అతని మరణము సమీపించినందున, బాబా అతని కీ విరుగుడు నుపదేశించెను. మృత్యుదేవతకు 'రామవిజయము' ప్రీతి యగుటచే దానిని చదివించెను. ఆ మరుసటి యుదయము స్నానము మొదలగునవి యాచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండీ తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. రెండు పారాయణములు చెయగనే యలసిపోయెను. వాడాకు వచ్చి రెండు దినము లుండెను. మూడవరోజు ఫకీరు (బడే) బాబా తొడపై ప్రాణములు వదలెను. బాబా ఒకరోజంతయు శవము నటులే యుంచుడనెను. పిమ్మట పోలీసువాండ్రు వచ్చి, విచారణ జరిపిన పిమ్మట శవసంస్కారమున కాజ్ఞ నిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడెను.

2. బాలారామ్ మాన్ కర్

బాలారామ్ మాన్ కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తిచెంది కొడుకునకు గృహభారమప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని, అతనికి సద్గతి కలుగ జేయవలెనని యీ దిగువరీతిగ జేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్ర గడలో నుండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగడలో నుండుట అతని కిష్టము లేకుండెను. కాని యదే అతనికి మంచి మార్గమని బాబా యొప్పించెను. అచట రోజుకు మూడుసారులు ధ్యానము చేయమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్ కర్ గడముకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతిసౌందర్యమును జూచి సంతసించి, బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానముచేయ మొదలిడెను. కొలది దినముల పిమ్మట యొకదృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధిస్థితియందు దృశ్యములను పొందెదరుగాని మాన్ కర్ విషయములో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దృశ్యము లభించెను. అతనికి బాబా స్యయముగా గాన్పించెను. మాన్ కర్ బాబాను జూచుటయేగాక తన నచట కేల పంపితివని యడిగెను. బాబా యిట్లు చెప్పెను. "షిరిడీలో అనేకాలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచలమనస్సునకు నిలకడ కలుగజేయవలెనని యిచటకు బంపితిని. " కొంతకాలము గడచిన పిమ్మట మాన్ కర్ గడమును విడచి బాంద్రాకు పయనమయ్యెను. పూనానుండి దాదరుకు రైలులో పోవలెననుకొనెను. టిక్కెట్టుకొరుకు బుకింగ్ ఆఫీసుకు పోగా నది మిక్కిలి క్రిక్కిరిసి యుండెను. అతనికి టిక్కెటు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళికప్పుకొని ఒక పల్లెటూరివాడు వచ్చి, "మీరెక్కడికి పోవుచున్నా" రని యడిగెను. దాదరుకని మాన్ కర్ బదులు చెప్పెను. అతడిట్లనెను. "దయచేసి నా దాదరు టిక్కెటు తీసికొనుము, నాకవసరమైన పని యుండుటచే దాదరుకు వెళ్ళుట మానుకొంటిని." టిక్కెటు లభించినందున మాన్ కర్ యెంతో సంతసించెను. జేబులోనుంచి పైకము తీయునంతలో నా జానపదు డంతర్ధానమయ్యెను. మాన్ కర్ ఆగుంపులో నతనికై వెదకెను. కాని లాభము లేకపోయెను. అతని కొరకు బండి కదలునంతవర కాగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్ కర్ కు కలిగిన వింత యనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్ కర్ షిరిడీ చేరెను. అప్పటినుంచి షిరిడీలోనే బాబా పాదముల నాశ్రయించి యుండెను. వారి సలహాల ననుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి యాశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అత డెంతో యదృష్టవంతు డని చెప్పవచ్చును.

3. తాత్యాసాహెబు నూల్కర్

తాత్యాసాహెబు నూల్కర్ గూర్చి హేమాడ్ పంతు ఏమియు చెప్పియుండలేదు. వారు షిరిడీలో కాలము చేసినవారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రికనుంచి యీ వృత్తాంతమును గ్రహించితిమి.

1909వ సంవత్సరములో తాత్యాసాహెబు పండరీపురములో సబ్ జడ్జీగా నుండెను. అప్పుడు నానాసాహెబు చాందోర్కరు అచట మామలతదారుగా నుండెను. ఇద్దరు చాలసార్లు కలిసికొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహబుకు యోగులయందు నమ్మకము లేకుండెను. నానాసాహెబుకు వారియందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబు, నూల్కర్ కు బాబా లీలలను చెప్పి, షిరిడీకి పోయి వారి దర్శనము చేయుమని బలవంతపట్టెను. తుదకు రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణవంటవాడు దొరక వలెను. రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను. భగవత్కటాక్షముచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు వద్దకు రాగా ఆతడు వానిని తాత్యాసాహెబు నూల్కర్ వద్దకు పంపెను. ఎవరోగాని 100 కమలాఫలములను నూల్కర్ కు పంపిరి. రెండు షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబు షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా యవతారపురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబు నూల్కర్ కు లభించెను. కనుక నతడు బాబా యెడ మక్కువపడి తన యంత్యదశవరకు షిరిడీలోనే యుండెను. తన యంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతని కిచ్చిరి. అతని మరణవార్తవిని బాబా యిట్లనెను. "అయ్యో! తాత్యా మనకంటె ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మము లేదు."

4. మేఘశ్యాముడు

28వ అధ్యాయములో మేఘునికథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసు లందరు శవమువెంట వెళ్ళిరి. బాబా కూడ వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహనసంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్ళు కారెను. సాధారణ మానవునివలె బాబా చింతావిచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి, దగ్గరిబంధువువలె నేడ్చి బాబా మసీదుకు తిరిగివచ్చెను.

యోగు లనేకులు భక్తులకు సద్గతి నిచ్చుట విందుము. కాని బాబా గొప్పదన మమోఘమైనది. క్రూరమైన పులికూడ వారివలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును.

5. పులి

బాబా సమాధి చెందుటకు 7రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై నినుపగొలుసులతో కట్టియుంచిన పులి యుండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి యుండెను. దానిని ముగ్గురు దూర్వీషులు పెంచుచు ఊరూరు త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జోవనోపాధి. ఆ పులి యేదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసికొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారమువద్ద నిలబెట్టి, దూర్వీషులు బాబా వద్దకు బోయి దాని విషయ మంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో దానివైపు ప్రజలందరు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు దీసికొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసికొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక యది తల వాల్చెను. బాబా దానివైపు చూడగా, నది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివితప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట జూచి దూర్వీషులు విరక్తి జెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే నది బాబా సముఖమున వారి పాదములవద్ద ప్రాణములు గోల్పోవుట దాని పూర్వజన్మపుణ్యమే యని భావించిరి. అది వారికి బాకీపడి యుండెను. దాని బాకీ తీరిన వెంటనే యది విమోచనము పొంది, బాబా పాదములచెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదములకడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింప బడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి యెట్లు కలుగును?

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదియొకటవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|
V. Rama Aravind.
2009-10-01.
Posted on: 2009-11-30.
Last Updated: 2011-11-08.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me