Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook


Topic 45

శ్రీ సాయి సత్ చరిత్రము
నలుబదియారవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 46

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియారవ అధ్యాయము

బాబా గయవెళ్ళుట - రెండు మేకల కథ

ఈ అథ్యాయములో శ్యామా కాశి, గయ, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటోరూపమున నతనికంటె ముందు వెళ్ళుట చెప్పెదము. బాబా రెండుమేకల పూర్వజన్మవృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుట గూడ చెప్పుకొందుము.

తొలిపలుకు

ఓ సాయి! నీ పాదములు పవిత్రము లయినవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధములనుండి తప్పించు నీ దర్శనము కూడ మిక్కిలి పావనమయినది. ప్రస్తుతము నీరూప మగోచరమయినప్పటికి, భక్తులు నీయందే నమ్మక ముంచినచో, వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గరనుండిగాని యెంతోదూరమునుండిగాని యీడ్చెదవు. వారిని దయగల తల్లివలె కౌగిలించుకొనెదవు. నీ వెక్కడున్నావో నీ భక్తులకు దెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు శక్తివలన నిరాడంబరభక్తుల రక్షించెదవు. ఆంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవే పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు. నీ జీవితము నెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపములనుండి విముక్తి పొందుట యెట్లన-శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుని కోరికలను నీవు నెరవేర్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభసాధనము. ఈ సాధనవల్ల మన పాపములు, రజస్తమోగుణములు నిష్క్రమించును. సాత్వికగుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే యనగా నాత్మనేయనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్యశరాణాగతి. దీనికి తప్పనిసరి యొకేగుర్తు - మన మనస్సు నిశ్చలము శాంతము నగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు, విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము, ఒకటి వెనుక నింకొకటి వెన్నంటి వచ్చును.

ఒకవేళ బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే యుండి, యింటి వద్దనుగాని దూరదేశమునగాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తనయిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము, బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరానిరూపమున నుండును. ఈ దిగువకథ దీనికి ఉదాహరణము.

గయ యాత్ర

బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకాసాహెబు తనపెద్దకుమారుడు బాబు ఉపనయనము నాగపూరులో చేయనిశ్చయించెను. సుమారదే సమయమందు నానాసాహెబు చాందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్ లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబు, నానాసాహెబు చాందోర్కరును, షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా దీసికొని వెళ్లుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంతపెట్టగా బాబా వారికి శ్యామాను దీసుకొని పోవలసినదనియు "కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటె ముందుగనే గయలో కలిసికొనెద" నని చెప్పెను. ఈమాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపియని నిరూపించును.

బాబా సెలవు పుచ్చుకొని, శ్యామా నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయంచెను. అచటినుండి కాశీ, ప్రయాగ, గయ పోవలె ననుకొనెను. అప్పాకోతే యతని వెంట బోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయనమునకు బోయిరి. కాకాసాహెబు దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుక నిచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి బోయిరి. అచ్చట నానాసాహెబు చాందోర్కరు శ్యామాకు 100 రూపాయలును, అతని బంధువగు జథార్ 100 రూపాయలును ఇచ్చిరి. అక్కడినుండి శ్యామా కాశీకి వెళ్లెను. అచ్చట జథారు యొక్క అందమైన లక్షీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటినుండి శ్యామా అయోధ్యకు పోయెను. అచ్చట జథారు మేనేజరు శ్రీ రామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజు లుండిరి, కాశీలో రెండు మాసము లుండిరి. అక్కడనుండి గయకు పోయిరి. రైలుబండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చీకాకు పడిరి, రాత్రి గయస్టేషనులో దిగి ధర్మశాలలో బసచేసిరి. ఉదయమే గయ పండా వచ్చి యిట్లనెను. "యాత్రికు లందరు బయలుదేరుచున్నారు. మీరు కూడ త్వరపడుడు." 'అచ్చట ప్లేగు గలదా?' యని శ్యామా ప్రశ్నించెను. లేదని పండా జవాబు నిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ యిల్లు చాల పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామా చాల సంతుష్టిచందెను. అచ్చట గల బాబాయొక్క అందమైన పెద్దపటము అతనికి అన్నింటికంటె ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది యింటికి ముందు భాగములో మధ్య నమర్చబడియుండెను. దీనిని చూచి శ్యామా మైమరచెను. "కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటె ముందుగనే గయకు బోయెదను" అను బాబా పలుకులను జ్ఞప్తికి దెచ్చుకొనెను. కండ్ల నీరు గ్రమ్మెను, శరీరము గగుర్పొడిచెను, గొంతుక యార్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి యేడ్వసాగెను. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము గలదని భయపడి యేడ్చుచున్నాడేమో యని పండా యనుకొనెను. పండాను బాబా పటమెక్కడనుండి తెచ్చితివని శ్యామా అడిగెను. పండా తన ప్రతినిధులు రెండుమూడువందల మంది మన్మాడులోను, పుణతాంబేలోను గలరనియు, వారు గయకు పోయే యాత్రికుల మంచిచెడ్డల చూచెదరనియు, వారివల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 యేండ్ల క్రిందట చేసితిననియు చెప్పెను. షిరిడీలో శ్యామా యింటిలో వ్రేలాడుచున్న బాబా పటమును జూచి దానినిమ్మని కోరితిననియు బాబా యనుజ్ఞపొంది శ్యామా దానిని తన కిచ్చెననియు చెప్పెను. శ్యామా పూర్వము జరిగిన దంతయు జ్ఞప్తికి దెచ్చుకొనెను. పూర్వము తనకు పటము నిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన యింట నతిథిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి యానందించెను. వారిరువురు ప్రేమానురాగములనుభవించి యమితానందమును పొందిరి. శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగత మిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యము లన్నియు నేర్పరచెను.

ఈ కథవల్ల నేర్చుకొనవలసిన నీతి :- బాబా మాటలు అక్షరాలా సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ యమితమనియు తెలియుచున్నది. ఇదియేగాక, వారికి జంతువులయందు కూడ సమాన ప్రేమ యుండెను. వారు వానిలో నొకరుగాభావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును.

రెండు మేకల కథ

ఒకనాడుదయము బాబా లెండితోటనుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకలమందను జూచెను. అందులో రెండుమేకల మీద బాబా దృష్టిపడెను. బాబా వానిని సమీపించి ప్రెమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని జూచి భక్తులు ఆశ్యర్యపడిరి. బాబా మిగుల మోసపోయెనని వారనుకొనిరి. ఎందుచేతననగా నొక్కొక్కమేకను 2 గాని, 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. రెండు మేకలును 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా నూరకొనెను. శ్యామా, తాత్యాకోతె బాబాను సమాధానము వేడగా బాబా "నాకు ఇల్లుగాని, కుటుంబముగాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు." అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని వానికి పెట్టుమని చెప్పెను. పిదప ఆ మేకలను వాని యజమానికి తిరగి యిచ్చివేసెను. వాని పూర్వవృత్తాంతమును ఈ రీతిగా చెప్పెను.

"ఓ శ్యామా! తాత్యా! మీరీ బేరములో నేను మోసపోయితినని యనుకొనుచున్నారు. అట్లు కాదు, వానికథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి యదృష్టము కొలది నా జతగాండ్రుగా నుండెడివారు. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి నొకరిపైనొకరికి ప్రేమయుండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాల ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయచెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యము నపహరింపనెంచెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరు కలహించిరి. అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్నుగడులను పన్నెను, కాని నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్దవైరు లయిరి. ఒకనాడు అన్న తన సోదరుని బెడితెతో కొట్టెను, చిన్నవాడు అన్నను గొడ్డలితో నరకెను. ఇద్దరదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలములచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్కనుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుకొంటిని. వారియందు కనికరించి వారికి తిండి పెట్టి, కొంత విశ్రాంతి కలుగజేసి యోదార్చవలెనని యనుకొంటిని. అందుచే నింతద్రవ్యమును వ్యయపరచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వాని యజమానివద్దకు తిరిగి పంపివేసితిని." మేకలపైని కూడ బాబా ప్రేమ యెట్టిదో చూడుడు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియారవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

V Rama Aravind,
2007-05-06.
Posted on: 2007-05-31.
Last updated on: 2011-11-20.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me