Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook


Topic 51

శ్రీ సాయి సత్ చరిత్రము
రెండవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 2

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

రెండవ అధ్యాయము

ఈ గ్రంథరచనకు కారణము, పూనుకొనుటకు అసమర్ధతయు ధైర్యము; గొప్పవివాదము; హేమడ్ పంతు అను బిరుదు ప్రదానము; గురువుయొక్క యావశ్యకత.

ఈ గ్రంధరచనకు ముఖ్యకారణము

మొదటి యధ్యాయములో గోధుమలను విసరి యా పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీసాయి యొక్క యితర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింతలీలలును చర్యలును మనస్సున కానందము కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను బోగొట్టును గదా యని భావించి బాబాయొక్క పవిత్ర జీవితమును, వారి బోధలును వ్రాయ మొదలిడితిని. యోగీశ్వరుని జీవితచరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యము, ఆధ్యాత్మికమునైన మార్గమును జూపును.

పూనుకొనుటకు అసమర్థతయు, ధైర్యము

ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థతగలవాడను కానని హేమడ్ పంతు అనుకొనెను. అతడిట్లనియెను. "నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో యోగీశ్వరుని నెట్లు వర్ణించగలరు? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియయిగాని యోగి యొక్క జీవితమును గ్రహించ జాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను. సప్తసముద్రముల లోతును గొలువవచ్చును. ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహుకష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని నాకు తెలియును. నలుగురు నవ్వునట్లు అగుదునేమోయని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహముకొరకు ప్రార్థించితిని."

మహారాష్ట్రదేశములోని మొట్టమొదటికవియు, యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వరమహారాజు యోగులచరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగు లనేక మార్గముల నవలంబించెదరు. యోగులే యట్టిపనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారివారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శ క సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతని ప్రోత్సాహించి, కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శ క సంవత్సరములో దాసగణుయొక్క సేవను ఆమోదించిరి. మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను. అవి భక్తవిజయము, సంతవిజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి భక్తలీలామృతమును సంతకథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు. భక్తలీలామృతములోని 31, 32, 33, అధ్యాయములందును, సంతకథామృతములోని 57వ యధ్యాయమందును సాయిబాబా జీవితచరిత్రయు, వారి బోధలును చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక, సంచికలు 11, 12 సంపుటము 17 నందు ప్రచురితము. చదువరులు ఈ యధ్యాయములు కూడ పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసియగు సావిత్రి బాయి రఘునాథ్ తెండుల్కర్ చే చక్కని చిన్న పుస్తకములో వర్ణింవబడినవి. దాసగణు మహారాజుగారు కూడ శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాత్ భాషలో అమిదాసు భవాని మెహతా యను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థవారు ప్రచురించియున్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సత్చరిత్ర వ్రాయుటకు కారణమేమైయుండును? దాని యవసరమేమి? యని ప్రశ్నింపవచ్చును.

దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రమువలె విశాలమైనది; లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మణులను తీసి కావలసిన వారికి పంచిపెట్ట వచ్చును. శ్రీ సాయిబాబా నీతిబోధకమగు కథలు, లీలలు మిక్కిలి యాశ్చర్యము కలుగజేయును. అవి మనోవికలత పొందినవారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి యానందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదములవలె రంజకములు ఉపదేశకములునునగు బాబా ప్రబోధలు విని, వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావిణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తకరూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలుగజేయును. అందుచేత బాబాగారి యాత్మసాక్షాత్కారఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే యీ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా యహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా యిహపరసౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని.

నేను నా యంతట ఈ గ్రంథరచనకు బాబా యెక్క యనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అను వారు బాబాకు ముఖ్యభక్తుడు. వారిని నా తరపున మాట్లాడుమంటిని. నా తరవున వారు బాబాతో నిట్లనిరి. "ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను, నా జీవితచరిత్ర వ్రాయనవసరము లేదని యనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు. లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీయొక్క యనుమతి యాశీర్వాదము లేనిదే యేదియు జయప్రదముగా చేయలేము." సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను. మరియు నిట్లు చెప్పదొడంగెను. "కథను, అనుభవములను, ప్రోగు చేయుమను. అక్కడక్కడ కొన్ని ముఖ్యవిషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. వాడు కారణమాత్రుడే కాని నా జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికే నేను మిక్కిలి సహాయపడెదను. వారి జీవిత చర్యలకొరకే కాదు. సాధ్యమైనంతవరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని యహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడ లేకుండనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచినదానినే నీవు నిర్థారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల యభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు."

వివాదమనగనే నన్ను హేమడ్ పంతు అని పిల్చుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. దానినే మీకు చెప్పబోవుచున్నాను. కాకా సాహెబు దీక్షిత్, నానా సాహెబు చాందోర్కరులతో నే నెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి. అట్లే చేసెదనని వారికి నేను వాగ్దానము చేసితిని. ఈ మధ్య నేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమున కడ్డుపడినది. లొనావ్లాలో నున్న నా స్నెహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములన్నియు నుపయోగించెను గాని నిష్ఫలమయ్యెను. జ్వరము తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని "నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువుయొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమి సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ యేల పోవలెను?" అని భావించి షిరిడీ ప్రయాణమును ఆపితిని. కాని కానున్నది కాక మానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను.

నానాసాహెబు చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి, వసాయీకి పోవు చుండెను. ఠాణానుండి దాదరుకు వచ్చి యచ్చట వసాయీ పోవు బండి కొరకు కనిపెట్టుకొని యుండెను. ఈ లోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేయుటవల్ల నాపై కోపించెను. నానా చెప్పినది, వినోదముగను సమ్మతముగాను ఉండెను. అందుచే నా రాత్రియే షిరిడీపోవ నిశ్చయించితిని. సామానులను కట్టుకొని షిరిడీ బయలుదేరితిని. దాదరు వెళ్ళి యచ్చట మన్నాడ్ మెయిలుకొరకు వేచి యుంటిని. బండి బయలుదేరునప్పుడు నేను కూర్చొనిన పెట్టెలోనికి సాయిబొకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నియు జూచి యెక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా యా లోచన వారికి చెప్పితిని. వెంటనే బోరీ బందరు స్టేషనుకు బోవలయునని నాకు సలహా చెప్పెను. ఎందుకనగా మన్మాడు పోవుబండి దాదరులో నాగదనెను. ఈ చిన్న లీలయే జరగ కుండినచో నే ననుకొనిన ప్రాకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయెడివాడను. అనేక సందేహములుకూడ కలిగి యుండును. కాని యది యట్లు జరుగలేదు. నా యదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు 9, 10 గంటలలోగా షిరిడీ చేరితిని. నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకొని యుండెను.

ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడ యొక్కటియే వచ్చుభక్తులకొరకు నిర్మింపబడి యుండెను. టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను. అంతలో తాత్యా సాహెబు నూల్కరు అప్పుడే మసీదునుండి వచ్చుచు బాబా వాడాచివరన ఉన్నారని చెప్పెను. మొట్టమొదట ధూళీదర్శనము చేయమని సలహా యిచ్చెను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను. ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసితిని. ఆనందము పొంగిపొరలినది. నానాసాహెబు చాందోర్కరు చెప్పినదానికి ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తిచెంది యాకలి దప్పికలు మరచితిని. మనస్సునకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్పమార్పుకలిగెను. నన్ను షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి ఋణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా మనసులో సాష్టాంగప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనమువల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యాలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మసుకృతముచే నాకీ దర్శనము లభించిన దనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచ మంతయు సాయిబాబా రూపము వహించెను.

గొప్ప వివాదము

నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలా సాహెబు భాటేకును గురువుయొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి యింకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మనుండి తప్పించుకొనవలెను. ఏమీచేయక సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడు? నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించితిని. భాటే యింకొక మార్గము బట్టి ప్రారబ్దము తరపున వాదించుచు "కానున్నది కాకమానదు. మహనీయులుకూడ నీ విషయములో నోడిపోయిరి. మనుజు డొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివి తేటలను అటుండనిమ్ము. గర్వముగాని యహంకారము కాని నీకు తోడ్పడవు" ఈ వాదన యొక గంటవరకు జరిగెను. కాని యిదమిత్థమని చెప్పలేకుంటిమి. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. శరీరస్పృహ, అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి. వేయేల వివాదమునకు మూలకారణ మహంకారము.

ఇతరులతో కూడ మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి యిట్లడుగ దొడంగెను. "సాఠేవాడలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమడ్ పంతు ఏమని పలికెను?"

ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడ మసీదునకు చాల దూరముగ నున్నది. మా వివాదమునుగూర్చి బాబాకెట్లు దెలిసెను? అతడు సర్వజ్ఞూడై యుండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా మన యంతరాత్మపై నధికారియై యుండవచ్చును.

హేమడ్ పంతు అను బిరుదునకు మూలకారణము

నన్నెందుకు హేమడ్ పంతు అను బిరుదుతో పిలిచెను? ఇది హేమాద్రిపంతు అను నామమునకు మారు పేరు. దేవగిరి యాదవ వంశమున బుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు; చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియను గొప్పగ్రంధములను రచించినవాడు; మోడి భాషను కని పెట్టినవాడు. క్రొత్తపద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను. మేధాశక్తి యంతగా లేనివాడను. నా కెందుకీబిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా నిది నా యహంకారమును చంపుటకొక యమ్మనియు, నే నెప్పుడును అణకువనమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరిక యయి యుండవచ్చుననియు గ్రహించితిని. వివాదములో గెలిచనందులకు బాబా యీ రీతిగా తెలివికి అభినందనము లిచ్చియుండునని యనుకొంటిని.

భవిష్యచ్చరితనుబట్టి చూడగా బాబా పలుకులకు (దభోల్కరును హేమడ్ పంతు అనుట) గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తును తెలిసియే యట్లనెననియు భావించవచ్చును. ఏలయనగా హేమడ్ పంతు శ్రీసాయిసంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను. లెక్కలను బాగుగ నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సత్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను.

గురువుయొక్క యావశ్యకత

ఈ విషయమై బాబా యేమనెనో హేమడ్ పంతు వ్రాసియుండలేదు. కాని కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమునుగూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రకటించెను. హేమడ్ పంతు బాబాను కలసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా యని యడిగెను. బాబా యట్లే యని జవాబిచ్చెను. ఎవరో, యెక్కడకు అని యడుగగా, చాల పైకి అని బాబా చెప్పగా, మార్గమేది యని యడిగిరి. "అక్కడకు పోవుటకు అనేకమార్గములు కలవు. షిరిడీనుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున నున్న యడవిలో పులులు, తోడేళ్ళు కల" వని బాబా బదులిడెను. కాకా సాహెబు లేచి మార్గదర్శకుని వెంటదీసికొని పోయినచో నని యడుగగా, నట్లయినచో కష్టమే లేదని జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడ వచ్చును. లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. దభోళ్కరు అచ్చటనే యుండుటచే తన ప్రశ్న కిదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంతవిషయములలో మానవుడు స్వేచ్ఛాపరూడా కాడా? యను వివాదమువలన ప్రయోజనము లేదని గ్రహించెను. నిజముగా, పరమార్థము గురుబోధలవల్లనే చిక్కుననియు రామకృష్ణులు వసిష్ఠ సాందీపులకు లొంగి యణకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము, ఓపిక యను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
రెండవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

V Rama Aravind,
2007-08-16.
Posted on: 2007-11-30.
Last updated on: 2011-11-20.
Top

© 2003 - 2020, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2020-11-12. Contact Me