Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook


Topic 57

శ్రీ సాయి సత్ చరిత్రము
ఎనిమిదవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 8

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

(రెండవరోజు పారాయణ - శుక్రవారము)

ఎనిమిదవ అధ్యాయము

మానవజన్మ ప్రాముఖ్యము; సాయిబాబా భిక్షాటనము; బాయిజా బాయి సేవ; సాయిబాబా పడక జాగా; కుశాల్ చంద్ పై వారి ప్రేమ.

మానవజన్మయొక్క ప్రాముఖ్యము

ఈ యద్భుత విశ్వమందు భగవంతుడు కోట్లకొలది జీవులను సృష్టించి యున్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగువానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి యంతయు సృష్టించెను. వీరిలో నెవరిపుణ్య మెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము ననుభవించిన పిమ్మట త్రోసి వేయబడుదురు. ఎవరిపాప మెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనమునకై యవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించునపుడు వారికి మోక్షము కలుగును. వేయేల? మోక్షముగాని, పుట్టుకగాని వారువారు చేసికొనిన కర్మపై ఆధారపడి యుండును.

మానవశరీరముయొక్క ప్రత్యేక విలువ

జీవకోటి యంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవున కివిగాక యింకొక శక్తిగలదు. అదియే జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీని కవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు కూడ మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడ భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు.

కొంతమంది మానవజన్మము చాల నీచమైనదనియు; చీము, రక్తము, మురికితో నిండియుండు ననియు; తుదకు శిథిలమయి రోగమునకు మరణమునకు కారణమగునందరు. కొంతవర కదికూడ నిజమే. ఇన్ని లోటులున్నప్పటికి మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. మానవ శరీరమునుబట్టియే జన్మ యశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచ మంతయు మిధ్యయని, విరక్తి పొందును. ఇంద్రియసుఖములు అనిత్యములు, అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని, యనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము. శరీరమును ముద్దుగా పెంచి, విషయసుఖములకు మరిగినచో నరకమునకు పోయెదము. మనము నడువవలసిన త్రోవ యేదన; శరీరము నశ్రద్ధ చేయకూడదు. దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. గుర్రపురౌతు తన గమ్యస్థానము చేరువరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో యంతజాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. ఈ శరీరము మోక్షము సంపాదించుటకు గాని లేక యాత్మసాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియై యుండవలెను.

భగవంతు డనేక జీవులను సృష్టించినప్పటికి అతనికి సంతుష్టి కలుగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని యవి గ్రహించలేక పోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేకశక్తి నిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, బుద్ధిని మెచ్చుకొనునప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి జెంది యానందించెను. అందుచే మానవజన్మ లభించుట గొప్ప యదృష్టము. బ్రాహ్మణజన్మ పొందుట అంతకంటె మేలయినది. అన్నిటికంటె గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయునవకాశము కలుగుట.

మానవుడు యత్నించవలసినది

మానవజన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు, గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును. ఏమాత్రమును అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్యకొర కెంత ఆతురపడునో, కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి యెంతగా వెదక యత్నించునో యట్లనే యాత్మసాక్షాత్కారము పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమొనర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము.

నడువవలసిన మార్గము

మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గ మేదన, వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువువద్ద కేగుట. మతసంబంధమైన యుపన్యాసములు వినినప్పటికి పొందనట్టిదియు, మతగ్రంథములు చదివినను తెలియనట్టిదియు నగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నియు కలిసి యివ్వలేని వెలుతురు సూర్యు డెట్లు ఇవ్వగలుగుచున్నాడో యట్లనే మతోపన్యాసములు, మత గ్రంధములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి వైఖరి, సంభాషణలే గుప్తముగా మనకు సలహా నిచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును - మనస్సును స్వాధీన మందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను - వారు అనుసరించునప్పుడు వారి పావనజీవితమునుంచి భక్తులు నేర్చుకొందురు. ఇది భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా యట్టి యోగిపుంగవుడు; సద్గురువు.

బాబా ఫకీరువలె నటించునప్పటికిని వారెప్పుడును ఆత్మానుసంధానమందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గలవారిని, పవిత్రుల నెల్లప్పుడు ప్రేమించుచుండిరి. సుఖములకు ఉప్పొంగువారు కారు. కష్టములవలన క్రుంగిపోవువారు కారు. రాజున్ను, దివాలా తీసిన వాడున్ను బాబాకు సమానమే. తమదృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగలశక్తి యున్నప్పటికి బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష యెట్టిదో చూతుము.

బాబా యొక్క భిక్షాటనము

షిరిడీజనులు పుణ్యాత్ములు. వారి యిండ్లయెదుట బాబా భిక్షుకుని వలె నిలచి "అక్కా! రొట్టెముక్క పెట్టు" అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. ఒకచేతిలో తంబిరేలుడొక్కు, ఇంకొక చేతిలో గుడ్డజోలీ పట్టుకొని పోవువారు. ప్రతిరోజు కొన్నియిండ్లకు మాత్రమే పోవువారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసికొనెడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనెడివారు. బాబాకు రుచి యనునది లేదు. వారు నాలుకను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్నివస్తువులును డొక్కులోను, జోలెలోను వేసికొనెడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సంతుష్టిచెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి యనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా సరిగ 12 గంటలవరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను. ఒక్కొక్కదినమందు కొన్ని యిండ్లకు మాత్రమే పోయెడి వారు. సాధారణముగా 12 గంటలవరకు భిక్షచేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమే వారు కారు. మసీదు తుడిచి శుభ్రముచేయు స్త్రీ 10, 12 రొట్టెముక్కలను నిరాటంకముగా తీసికొనుచుండెడిది. కుక్కలను, పిల్లులను, కలలోగూడా యడ్డుపెట్టనివారు, ఆకలిబాధతో నున్న మానవులకు భోజనము పెట్టుట మానుదురా? ఆయన జీవితము మిగుల పావనమైనది.

మొదట షిరిడీ ప్రజలు బాబాను పిచ్చిఫకీరని పిలిచెడివారు. ఎవరయితే భోజనోపాధికై గ్రామములో రొట్టెముక్కలపై నాధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా? వారి మనస్సు, చేయి ధారాళమయినవి, ధనాపేక్షలేక దాక్షిణ్యము చూపువారు. బయటికి చంచలముగ సుస్థిరత్వములేని వారుగ గాన్పించినను లోన వారు స్థిరమనస్సు గలవారు. వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామములో కూడ దయార్ద్రహృదయులును, వవిత్రులును కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి. అట్టివారి విషయమొకటి యిచ్చట చెప్పుచున్నాను.

బాయిజాబాయి గొప్ప సేవ

తాత్యాకోతే పాటీలు తల్లిపేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకొని, యడవిలో బాబా తపస్సు చేయుచున్నచోటికి బోయి బాబాకు భోజనము పెట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైళ్ళకొలది ముండ్లు, పొదలు దాటి బాబాను వెదికి పట్టుకొని, సాష్టాంగనమస్కారము చేయుచుండెను. ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానము చేయుచుండువాడు. ఆమె బాబా యెదుట విస్తరొకటి వేసి భోజన పదార్థములు, రొట్టె, కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతముచేసి తినిపించుచుండెను. ఆమె భక్తివిశ్వాసములు చిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ళకొలది నడచి బాబాను వెదకి పట్టుకొని భోజనము చేయమని బలవంతము చేయుచుండిరి. ఆమె సేవను బాబా మహాసమాధి యగునంతువరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలునకు బాబా రోజు ఒక్కంటికి రూ. 25/- కానుకగా నిచ్చుచుండెను. తల్లికొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనెడి విశ్వాసముండెను. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియు, లోకులనుకొనే ధనము వట్టి బూటకమనియు చెప్పుచుండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా యడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు. అప్పటినుంచి పొలములో తిరుగు కష్టము బాయజాబాయికి తప్పినది.

ముగ్గురు - పడక స్థలము

యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయమందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప యదృష్టవంతులు. అట్టివారిద్దరు; తాత్యాకోతే పాటీలు, మహళ్సాపతి. బాబా వారిని సమానముగా ప్రేమించువారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి ఒకరి కాళ్లు ఒకరికి మధ్య తగులునట్లు నిద్రించుచుండిరి. ప్రక్కలు పరచుకొని, వానిపై చితికిలపడి సగమురేయివరకు ఏవో సంగతులు మాట్లాడుకొనుచుండిరి. అందులో నెవరైన పండుకొన్నట్లు గాన్పించిన తక్కినవారు వారిని లేవగొట్టుచుండిరి. తాత్యాపండుకొని గుఱ్ఱుపెట్టినచో బాబా వానిని యటునిటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. మహాళ్సాపతిని కౌగలించుకొని, కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధముగా 14 సం।।లు తాత్యాతల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను. అవి మరపురాని సంతోషదినములు. బాబా ప్రేమకటాక్షములు కొలువరానివి; ఇంతయని చెప్పుటకు వీలులేనివి. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్యాయింటి యజమాని యగుటచే నింటిలోనే నిద్రించుట ప్రారంభించెను.

రాహాతా నివాసి కుశాల్ చంద్

షిరిడీలోని గణపతికోతే పాటీలను వానిని బాబా ప్రేమించువారు. అంతటి ప్రేమతోనే రాహాతా నివాసియగు చంద్రభాను శేట్ మార్వాడీని జూచుచుండెను. ఈ శేట్ చనిపోయిన పిమ్మట వాని యన్న కొడుకగు కుశాల్చందును గూడ మిక్కిలి ప్రేమతో జూచుచు రాత్రింబగళ్ళు వాని క్షేమ మడుగుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, ఇంకొకప్పు డెద్దులబండి మీద బాబా తన ప్రియభక్తులతో రాహాతా పోవువారు. రాహాతా ప్రజలు బాజాభజంత్రీలతో బాబాను గ్రామసరిహద్దు ద్వారమువద్ద కలిసి సాష్టాంగనమస్కారములు చేసేవారు. గొప్పవైభవముతో బాబాను గ్రామములోనికి తీసికొని వెళ్ళేవారు. కుశాల్ చందు బాబాను తన యింటికి తీసికొనిపోయి తగిన యాసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను, ఉల్లాసముగాను మాట్లాడెడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండువారు.

షిరిడీ; రాహాతాకు, దక్షిణమున నీమ్గాంకు ఉత్తరదిశయందు మధ్యనున్నది. ఈ రెండు గ్రామములు విడిచి బాబా యెన్నడు ఎచ్చటికి పోయియుండలేదు. రైలుబండి చూచి యుండలేదు. దానిపై ప్రయాణము చేసి యెరుగరు. కాని బండ్ల రాకపోకలు సరిగా తెలిసి యుండెడివారు. బాబా సెలవు పుచ్చుకొని వారి యాజ్ఞానుసారము ప్రయాణము చేయువారల కేకష్టము లుండెడివికావు. బాబా యాజ్ఞకు వ్యతిరేకముగ పోవువారనేక కష్టములపాలగుచుండిరి. ఈ వృత్తాంతము ఇంకను ఇతరవిషయములు వచ్చే యధ్యాయములో చెప్పెదను.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

V Rama Aravind.
2008-05-22.
Posted on: 2008-06-30.
Last updated on: 2011-11-05.
Top

© 2003 - 2020, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2020-11-12. Contact Me