Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook

శ్రీ సాయి సత్ చరిత్రము
నలుబదియవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 40

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియవ అధ్యాయము

బాబా కథలు

1. దేవుగారి యింటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి యిద్దరిని తోడ్కోని పోవుట. 2. హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట.

ఈ యధ్యాయములో రెండు కథలు చెప్పుదుము. 1. దహనులో బి.వి. దేవుగారింటికి వారి తల్లి యాచరించిన ఉద్యాపనపత్రమునకు బాబా వెళ్ళుట. 2. బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోళీ పండుగనాడు భోజనమునుకు పోవుట.

తొలిపలుకు

శ్రీ సాయిసమర్ధుడు, పావనమూర్తి. తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాల నిచ్చి జీవితపరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తులయెడ భేదము లేక నమస్కరించిన వారిని కౌగిలించుకొనువారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రమువలె బాబా భక్తులతో కలసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనినిబట్టి, యెవరయితే భగవద్ భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటెగాని, యంతకంటె యెక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము.

దేవుగారింట ఉద్యాపనపత్రము

దహనులో బి.వి. దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25, 90 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి యుండెను. ఈ కార్యములో 100, 200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి యుండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపు సాహెబుజోగ్ గారికి కొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయ వలయుననియు, వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాసెను. జోగ్ ఆ యుత్తరము చదివి బాబాకు వినిపించెను. మనః పూర్వకమయిన విజ్ఞాపనను విని బాబా యిట్లనియె. “నన్నే గురుతుంచుకొను వారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరములేదు. నన్ను ప్రేమతో బిలచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్ష్యమయ్యెదను. అతనికి సంతోషమయిన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయుము.” జోగ్ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగా రెంతో సంతసించిరి. కాని బాబా రాహాతా, రుయి, నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియును. బాబాకు అశక్యమైన దేమియు లేదు. వారు సర్వాంతర్యామి యగుటచే హఠాత్తుగా నేరూపమున నయిన వచ్చి, తమ వాగ్ధానమును పాలించ వచ్చు ననుకొనెను.

ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి యొకడు గోసంరక్షణకయి సేవచేయుచు దహను స్టేషన్ మాస్టరు వద్దకు చందాలు వసూలుచేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు, ఊరి లోనికి పోయి మామలతదారుని కలిసికొని వారి సహాయముతో చందాలు వసూలు చేయుమనెను. అంతలో మామలతదారే యచ్చటికి వచ్చెను. స్టేషను మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమొనర్చెను. ఇద్దరు ప్లాట్ ఫారమ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు, ఊరిలో నేదో మరొక చందాపట్టి రావుసాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే, నింకొకటి యిప్పుడే తయారుచేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి యచటనుండి పోయెను. ఒకనెల పిమ్మట యా సన్యాసి యొక టాంగాలో వచ్చి, 10 గంటలకు దేవుగారి యింటిముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై యుండుట జూచి, తాను చందాలకొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితిననియు సన్యాసి చెప్పెను. అందుకు దేవు “మంచిది; చాల మంచిది, మీకు స్వాగతము. ఈ గృహము మీదే” యనెను. అప్పుడు సన్యాసి “ఇద్దరు కుర్రవాళ్ళు నాతో నున్నారు.” యనెను. దేవు: “మంచిదే, వారితో కూడ రండు,” అనెను. ఇంకా రెండుగంటల కాలపరిమితి యుండుటచే, వారికొరకు ఎచ్చటికి పంపవలెనని యడిగెను. సన్యాసి ఎవరిని బంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి.

ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపుసాహెబు జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసికొని బాబావద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునుపే బాబా యిట్లనెను. “హా! వాగ్దానము చేసి, దగా చేసితిననుచున్నాడు. ఇద్దరితో కూడ నేను సంతర్పణకు హాజరయితిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేల? సన్యాసి చందాల కొరకు వచ్చెనని యనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి యారగించలేదా? నామాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిచెదను. నామాటలను నేనెప్పుడు పొల్లు చేయను.” ఈ జవాబు జోగ్ హృదయంలో నానందము కలుగ జేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు ఆనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటిరాకచే తానెట్లు మోసపోయెనో; సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలసి భోజనమునకు వచ్చెదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట – మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను.

భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు అనునది యీ కథవల్ల స్పష్టపడుచున్నది.

హేమాడ్ పంతు ఇంట హోళీపండుగ భోజనము

ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము.

1917వ సంవత్సరము హోళీ పండుగనాడు వేకువజామున హేమాడ్ పంతు కొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలె బాబా గాన్పించి, నిద్రనుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్రనుండి లేపినది కూడ కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని, బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు దెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతిమాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము ఏడు సంవత్సరములనుండి యున్నప్పటికి, బాబా ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికి, బాబా తన యింటికి వచ్చి భోజనము చేయునని అతడనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్యవద్దకు బోయి ఒకసన్యాసి భోజనమునకు వచ్చును గాన, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. ఆది హోళీ పండుగదినము. వచ్చువారెవరని, ఎక్కడనుండి వచ్చుచున్నారని యామె యడిగెను. ఆమె ననవసరముగా పెడదారి పట్టించక ఆమె యింకొక విధముగా భావింపకుండునట్లు, జరిగినది జరిగినట్లుగా చెప్ప నెంచి, తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండివంటలను విడిచి బాబా తనవంటివా రింటికి బాంద్రాకు వచ్చునాయని, యామెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైన బంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను.

మధ్యాహ్నభోజనమునకై ప్రయత్నము లన్నియు చేసిరి. మిట్టమధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి. ముగ్గులు పెట్టిరి. భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి, రెండింటిమధ్య నొక పీట బాబాకొరకమర్చిరి, గృహములోని వారందరు కొడుకులు, మనుమలు, కొమార్తెలు, అల్లుళ్ళు మొదలగువారందరు వచ్చి వారి వారి స్థలముల నలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరు అతిథికొరకు కనిపెట్టుకొనియుండిరి. 12 గంటలు దాటినప్పటికి ఎవరు రాలేదు. తలుపు వేసి గొండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి యయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుట కిది యొక గుర్తు; అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా, మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపుతీయగా ఇద్దరు మనుష్యులచట నుండిరి. 1. అలీమహమ్మద్, 2. మౌలానా ఇస్ముముజాఫర్. ఆ యిరువురు, వడ్డన మంతయు పూర్తియై అందరును భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించుమని కోరియిట్లు చెప్పిరి. “భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు. కావున, ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు దెలిపెదము.” అట్లనుచు తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబిల్ పైన బెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరగెను, కండ్లనుండి నీరు కారెను, శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా యీ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని యనుకొనెను. గొప్ప యాసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీమహమ్మద్ ను అడిగెను. అతడా పటమొక యంగడిలో కొంటిననియు, దానికి సంబంధించిన వివరము లన్నియు తరువాత తెలియజేసెద ననెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొని యుండుటచే త్వరగా పొమ్మని యనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెల్పి భోజనశాలలోనికి బోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపయి బెట్టి వండిన పదార్థములన్నియు వడ్డించి, నైవేద్యము పెట్టినపిమ్మట అందరు భుజించి, సకాలమున పూర్తి చేసిరి. పటములో నున్న బాబా యొక్క చక్కని రూపును జూచి యందరు అమితానందభరితు లయిరి. ఇదంతయు నెట్లు జరిగెనని యాశ్చర్యపడిరి.

ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో జెప్పినమాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా నది అలీమహమ్మదు కెట్లుదొరికెను? అత డెందుకు తెచ్చెను? దానిని హేమాడ్ పంతు కెందు కిచ్చెను? అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందుము.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

V. Rama Aravind.
2009-05-25.
Posted on: 2009-05-31.
Last updated on: 2011-11-10.
Top

© 2003 - 2020, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2020-11-12. Contact Me