Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook

శ్రీ సాయి సత్ చరిత్రము
ముప్పదినాలుగవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 34

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదినాలుగవ అధ్యాయము

ఊదీ మహిమ

1. డాక్టరు మేనల్లుడు, 2. డాక్టరు పిళ్ళే, 3. శ్యామా మరదలు, 4. ఇరాని పిల్ల, 5. కూర్దా పెద్దమనిషి, 6. బొంబాయి స్త్రీ - కథలు.

ఈ అధ్యాయములో కూడ ఊదీ మహిమ వర్ణితము. ఊదీ ధరించి నంత మాత్రమున నెట్టి ఫలములు కలిగెనో చూతము.

డాక్టరుగారి మేనల్లుడు

నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టరుండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయముకానట్టి రాచ కురుపుతో బాధ పడుచుండెను. డాక్టరుగారితోపాటు ఇతర డాక్టర్లుకూడ నయముచేయ ప్రయత్నించిరి. ఆపరేషను చేసిరి. కాని ఏమాత్రము మేలు జరుగ లేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు తల్లిదండ్రులను దైవసహాయము కోరుమనిరి. షిరిడీ సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠినరోగములు నయమయ్యెనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసిరి. కుర్రవానిని బాబా ముందు బెట్టిరి. తమ బిడ్డను కాపాడుమని అధికవినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్దృడగు బాబా వారిని ఓదార్చి యిట్లనెను. "ఎవరయితే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాదపడరు. కనుక హాయిగ నుండుడు. కురుపుపై ఊదీని పూయుడు. ఒక వారము రోజులలో నయమగును. దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరయితే యిందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు. వారి కష్టములు గట్టెక్కును." వారు కుర్రవానిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా యా కురుపుమీద తమ చేతిని త్రిప్పెను, ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊదీ రాయగా కురుపు నెమ్మదించెను. కొద్దిరోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవానితో గూడ బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడచిరి. బాబా ఊదీప్రసాదములవల్లన వారి దయాదృష్టివల్లను రాచకురుపు మానిపోయి నందులకు మిగుల సంతసించిరి.

ఈ సంగతి విని కుర్రవాని మామయగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవుచు మార్గమున బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోను మన్ మాడ్ లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగ చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున నతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలిబాగులో గడుపవలె ననుకొనెను. బొంబాయిలో మూడురాత్రులు వరుసగా నొక కంఠధ్వని "ఇంకను నన్ను నమ్మవా?" యని వినిపించెను. వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో నొక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదాపడుననుకొనెను. కాని, తన మనస్సులో బాబాను పరీక్షింపదలచి "రోగియొక్క వ్యాధి యీనడు కుదిరినచో, రేపే షిరిడీకి పోయెదను" అని యనుకొనెను. జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి, జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టరు తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగనమస్కార మొనర్చెను. బాబా అతనికి గొప్ప యనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యెను. అక్కడ 4 రోజులుండి, బాబా ఊదీతోను, ఆశీర్వచనములతోను ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బిజాపురుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటినుంచి అతనికి బాబాయందు భక్తికుదిరెను.

డాక్టరు పిళ్ళే

డాక్టరు పిళ్ళేయనునాతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని భాఉ (అన్నా) అని పిలుచువారు. బాబా యతనితో ప్రతివిషయము సంప్రదించువారు. అతని నెల్లప్పుడు చెంత నుంచుకొనువారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే (నారిపుండు) బాధపడెను. అతడు కాకాసాహెబు దీక్షిత్ తో "బాధ చాల హెచ్చుగా నున్నది. నేను భరించలేకున్నాను. దీనికంటె చావు మేలని తోచుచున్నది. గతజన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేనీబాధ ననుభవించుచున్నాను. కాని బాబావద్దకు బోయి యీ బాధ నాపుచేసి, దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడు" మనెను. దీక్షితు బాబావద్దకు వెళ్ళి యీ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరగెను. బాబా దీక్షితు కిట్లనెను. "నిర్భయుడుగా నుండు మనుము. అతడేల పదిజన్మలవరకు బాధ పడవలెను? పదిరోజులలో గత జన్మపాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి యిహపరసౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండ అతడేల చావును కోరవలెను? అతని నెవరివీపుపయి నయిన తీసికొని రండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను."

ఆ స్థితిలోనే డాక్టరును దెచ్చి బాబా కుడివైపున, ఫకీరు బాబా యెప్పుడు కూర్చుండుచోట, గూర్చుండ బెట్టిరి. బాబా అతనికి బాలీసు నిచ్చి యిట్లనెను. "ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసికొమ్ము. అసలయిన విరుగు డేమనగా గతజన్మపాపము లనుభవించి, విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని నోర్చుకొనుము. అల్లాయే యార్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడు ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు, సమస్తము అర్పింపుము. అనగా సర్వస్యశరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము." నానాసాహెబు కట్టు కట్టెననియు కాని, గుణమియ్యలేదనియు డాక్టరు పిళ్ళే చెప్పెను. బాబా యిట్లనెను. "నానా తెలివితక్కువవాడు; కట్టు విప్పుము. లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును."

ఈ సంభాషణ జరుగుచుండగా ఆబ్దుల్ (మసీదు బాగుచేసి దీపములు వెలిగించువాడు) వచ్చెను. దీపములు బాగుచేయుచుండగా, అతని కాలు సరిగా పిళ్ళే కురుపుమీద హఠాత్తుగా పడెను. కాలు వాచి యుండెను. దానిపయి అబ్దుల్ కాలు పడగనే యందులోనుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టరు పిళ్ళే బిగ్గరగా నేడ్వసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తరువాత నింకొకటి వచ్చుచుండెను. బాబా యిట్లనెను. "చూడుడు! మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు." పిళ్ళే యిట్లనెను, "కాకి ఎప్పుడు వచ్చును?" బాబా యిట్లు జవాబు నిచ్చెను. నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే యా కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు."

ఊదీ పూయుటవలన, దానిని తినుటవలనను, ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను.

శ్యామా మరదలు

శ్యామా తమ్ముడు బాపాజీ సావుట్ బావిదగ్గర నుండువాడు. ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో రెండు బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామావద్దకు పరుగెత్తి వచ్చి సహాయపడుమనెను. శ్యామా భయపడెను. కాని యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను, సాష్టాంగనమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగుచేయుమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి బోవుటకు అనుజ్ఞ నిమ్మనెను. బాబా యిట్లనెను. "ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊదీ పంపుము. జ్వరమునకు గాని, బొబ్బలకు గాని లక్ష్యపెట్ట నవసరము లేదు. మన తండ్రియును, యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నమయగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయము వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము."

బాబా ఊదీయందు శ్యామాకు సంపూర్ణవిశ్వాస ముండెను. బాపాజీ ద్వారా దానిని బంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించిరి. దానిని తీసికొనిన వెంటనే, బాగా చెమట పట్టెను; జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి యుదయము తన భార్యకు నయమగుట జూచి బాపాజీ యాశ్చర్యపడెను.

జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామా బాబా యాజ్ఞ ప్రకారము వెళ్లగా, నామె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి యాశ్చర్యపడెను. తమ్ముని అడుగగా బాబా ఊదీ ఒక్క రాత్రిలోనే యా బొబ్బలను బాగుచేసె ననెను. అప్పుడు "ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము" అను బాబా మాటల భావము శ్యామా తెలిసికొనగలిగెను.

టీ తీసికొని శ్యామా తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి యిట్లనెను. "దేవా! ఏమి నీ యాట! మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగచేసెదవు. తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు." బాబా యిట్లు జవాబిచ్చెను. "కర్మయొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను, నన్నే సర్వమునకు కారణ భూతునిగా నెంచెదరు. అది యదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్రహృదయులు. నేను భగవంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన యహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములూడి మోక్షమును పొందెదరు."

ఇరానీవాని కొమార్తె

ఒక ఇరానీవాని యనుభవమును చదువుడు. అతని కొమార్తెకు ప్రతిగంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్చరాగానే యామె మాటలాడ లేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఎ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీ నుపయోగించుమనెను. విలేపార్లేలోనున్న కాకాసాహెబు దీక్షిత్ వద్ద ఊది తీసికొని రమ్మనెను. ఇరానీ వాడు ఊదీని తెచ్చి ప్రతి రోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతిగంటకు వచ్చు మూర్చ 7 గంటల కొకసారి రాసాగెను. కొద్దిరోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను.

హర్దా పెద్దమనిషి

హర్దాపుర (మధ్యపరగణాలు) నివాసియగు వృద్దు డొకడు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టిరాళ్ళు ఆపరేషను చేసి తీసెదరు. కనుక, ఆపరేషను చేయించుకొమ్మని సలహా యిచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషను కొప్పుకొనకుండెను. అతని బాధ యింకొక రీతిగా బాగు కావలసియుండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతనివద్ద బాబా ఊదీ యుండెను. స్నేహితులు కొందరు చెప్పగా, వృద్ధుని కుమారుడు ఊదీ తీసికొని దానిని నీళ్ళలో కలిపి తండ్రికిచ్చెను. 5నిమషములలో ఊదీ గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రమువెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను.

బొంబాయి స్త్రీ

కాయస్థ ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీయొకతె ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. అమె కేమియు తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీరామమారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసికొని పొమ్మని సలహా యిచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్నిమాసము లక్కడనుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యమువలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్ళకు ప్రసవవేళ వచ్చెను. మామూలుగనే యోనిలో అడ్డు గనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగుపొరుగువారు వచ్చి, బాబా ఊదీని నీళ్ళలో కలిపియిచ్చిరి. 5 నిమిషములలో నా స్త్రీ సురక్షితముగా, ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టముకొలది చనిపోయినబిడ్డ పుట్టియుండెను. కాని తల్లి ఆందోళనము, బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందుంచుకొనిరి.

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదినాలుగవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|
V. Rama Aravind.
2009-12-15.
Posted on: 2009-12-31.
Last updated on: 2011-11-08.
Top

© 2003 - 2020, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2020-11-12. Contact Me