Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook

శ్రీ సాయి సత్ చరిత్రము
ముప్పదిమూడవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 33

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదిమూడవ అధ్యాయము

ఊదీ మహిమ

1. తేలుకాటు, ప్లేగు జ్వరములు నయమగుట, 2. జామ్ నేర్ చమత్కారము, 3. నారాయణరావు జబ్బు, 4. బాల బువ సుతార్, 5. అప్పాసాహెబు కులకర్ణి, 6. హరి భాఉ కర్ణిక్ - కథలు.

గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊదీ మహిమను వర్ణించెదము.

ప్రస్తావన

మన మిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణాకటాక్షములు, కొండంత పాపములను గూడ నశింపజేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును. అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది, యను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి ఋణమును ఈ జన్మయందుగాని వచ్చే పెక్కుజన్మలయందుగాని మనము తీర్చుకొనలేము.

ఊదీ ప్రసాదము

బాబా యందరివద్దనుంచి దక్షిణ తీసికొనుచుండునని యందరికి తెలిసిన విషయము. ఈ విధముగా వసూలుచేసిన మొత్తములో నెక్కువ భాగము దానము చేసి మిగతదానితో వంటచెఱకును (కట్టెలను) కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది యిప్పటికి నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది యనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమతమ యిండ్లకుతిరిగి పోవునప్పుడు పంచిపెట్టెడివారు.

ఊదీవలన బాబా యేమి బోధించ నుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద యగును. ఈ సంగతి జ్ఞప్తికి దెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవాండ్రు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, యొంటరిగానే పోయెదము. ఊదీ యనేకవిధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీద్వారా నిత్యానిత్యమునకు గల తారతమ్యము, అనిత్యమైనదానియం దభిమానరాహిత్యము గంటమ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది (ఊది) వివేకము, రెండవది (దక్షిణ) వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా యడిగి దక్షిణ తీసికొనుచుండెను. షిరిడీనుంచి యింటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటపై వ్రాసి తన వరదహస్తమును వారి శిరస్సులపై నుంచుచుండెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊదీ గురించి యొకటి పాడుచుండిరి. దాని పల్లవి "కళ్యాణ రామ రారమ్మ; గోనెలతో ఊదీని తేతెమ్ము." బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు.

ఇదంతయు ఊదియొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడ కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును యాతురతల నుండి విమోచనము మొదలగునవి యొసగుచుండెను. ఇక ఊదీ గూర్చిన కథలను ప్రారంభించెదము.

తేలుకాటు

నాసిక్ నివాసియగు నారాయణ మోతీరాంజాని యనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామనమోదక్ యను బాబా భక్తునివద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తనతల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని, తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యెను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా 'ఆనందాశ్రమము' అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి యీ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంత యుండెను. అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును. నొప్పియున్న చోట ఊదీని రాయవలెను. అందుచే నారాయణరావు ఊదీకొరకు వెదకెను. కాని యది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయము కోరి, బాబా నామజపము చేసి, బాబా పటము ముందు రాలిబడిన అగురవత్తి బూడిద చిటికెడంత తీసి దానినే ఊదీగా భావించి, నొప్పి యున్నచోట రాసెను. అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగనే నొప్పి మానిపోయెను. ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి.

ప్లేగు జబ్బు

ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు బాబా భక్తుని కొమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను. తనవద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కరు గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వేస్టేషనువద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతోకూడ 'కళ్యాణ్' పోవు చుండెను. వారివద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి, సాయి నామజపము చేసి, సహాయము నభ్యర్ధించి నానా సాహెబు తన భార్య నుదుటిపై రాసెను. ఆ భక్తుడిదంతయు జూచెను. అతడు తన కొమార్తె యింటికి పోవుసరికి మూడు రోజుల నుండి బాధ పడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తనభార్య నుదుటిపై మట్టిని పూసినప్పటినుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను.

జామ్నేర్ చమత్కారము

1904 - 1905 వ సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్ జామ్నేర్ లో, మామలతుదారుగా నుండెను. ఇది ఖాందేషు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ల దూరములో నున్నది. ఆయన కొమార్తె మైనతాయి గర్భిణి; ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమెస్థితి బాగులేకుండెను. ఆమె రెండుమూడు దినములనుండి ప్రసవవేదన పడుచుండెను. నానా సాహెబు ఔషధము లన్నియు వాడెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి దెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్ గిర్ బువ యను సన్యాసి యుండెను. బాబా అతనిని బాపుగిర్ బువ యనువారు. అతని స్వగ్రామము ఖాందేషులో నుండెను. అత డచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని బిలిచి మార్గమధ్యమున జామ్నేర్ లో కొంత విశ్రాంతి తీసికొని నానాసాహెబుకు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తనవద్ద రెండేరుపాయి లున్నవనియు, అవి జలగామ్ వరకు రైలుటిక్కెటుకు సరిపోవుననియు, కాబట్టి జలగామ్ నుండి జామ్నేర్ పోవుటకు (సుమారు 30 మైళ్ళు) ధనము లేదని రామగిర్ బువ చెప్పెను. అన్నియు సరిగా అమరును గాన, నీవు కలత జెందనవసరము లేదని బాబా పలికెను. శ్యామాను బిలచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయుమనెను. హారతి పాటను ఊదీని రామగిర్ బువాకిచ్చి నానాసాహెబుకు అందజేయుమనెను. బాబా మాటలపయి ఆధారపడి రామగిర్ బువ షిరిడీ విడచి, రాత్రి రెండున్నర గంటలకు జలగామ్ చేరెను. అచటికి చేరునప్పటికి అతనిచెంత 2 అణాలు మాత్రమే యుండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే యెవరో "బాపుగిర్ బువా యెవరు?" అని కేక వైచుచుండిరి. బువా యచ్చటికి పోయి తానేయని చెప్పెను. నానాసాహెబు పంపించినారని చెప్పుచు, ఆ బంట్రోతు ఒక చక్కని టాంగావద్దకు దీసికొని పోయెను. దానికి రెండు మంచి గుఱ్ఱములు కట్టియుండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా బోయెను. తెల్లవారు జామున టాంగా యొక సెలయేరువద్దకు చేరెను. బండి తోలువాడు గుఱ్ఱములను నీళ్ళు త్రాగించుటకు పోయెను. బంట్రోతు రామగిర్ బువాను ఫలహారము చేయుమని, ఫలహారపు దినుసులను బెట్టెను. గడ్డముమీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామగిర్ బువా యతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారముల తినకుండెను. కాని యా బంట్రోతు తాను హిందువుడ ననియు, గర్ వాల్ దేశపు క్షత్రియుడ ననియు, నానాసాహెబు ఆ ఫలహారముల బంపెను గాన, తినుట కెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరు కలిసి ఫలహారము చేసి బయలు దేరిరి. ఉషఃకాలమున జామ్ నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్ గిర్ బువా టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చుసరికి టాంగా గాని, టాంగా తోలువాడు గాని, బంట్రోతు గాని లేకుండిరి. బాపుగిర్ బువ నోటివెంట మాట రాకుండెను. దగ్గరనున్న కచేరికి బోయి యడుగగా, నానా సాహెబు ఇంటివద్దనే యున్నట్లు దెలిసెను. నానాసాహెబుగారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్దనుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఊదీ, హారతి పాట నానాసాహెబు కందజేసెను. మైనతాయి చాల దుస్థితిలో నుండెను. అంద రామెగూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి. నానా సాహెబు తన భార్యను బిలచి ఊదీని నీళ్ళలో కలిపి కొమార్తె కిచ్చి, హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము బంపెననుకొనిరి. కొద్దినిమిషములలో ప్రసవము సుఖముగా జరిగెనని వార్త వచ్చెను. గండము గడచినదని చెప్పిరి. నానాసాహెబు గారు టాంగా నౌకరును, ఫలహారములను పంపినందుకు బాపుగిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా నాతడు మిక్కిలి యాశ్చర్యపడెను. షిరిడీనుండి యెవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు. కనుక నత డేమియు పంపియుండలేదని చెప్పెను.

బి.వి. దేవ్ గా రీవషయమై బాపురావు చాందోర్కరును, రామగిర్ బువాను కలిసికొని విచారించి సాయిలీలా మాగజైన్ లో (XII - 11, 12, 13) గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బి.వి. నరసింహస్వామిగారు మైనతాయీ, బాపూరావు చాందోర్కరు, రాంగిర్ బువాల వాజ్ఞ్మూలమును సేకరించి "భక్తుల అనుభవములు" అను గ్రంథమున (3వ భాగము) ప్రకటించినారు.

భక్తనారాయణరావుకు బాబాను రెండుసారులు దర్శనముచేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవలెననుకొనెను. కాని, పోలేకపోయెను. బాబా సమాధి చెందిన యొక సంవత్సరములో నతడు జబ్బు పడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సలవలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో నొకదృశ్యమును జూచెను. అందు బాబా అతనిని ఓదార్చి యిట్లనెను. "ఆందోళన పడవద్దు. రేపటి నుంచి బాగగును. వారము రోజులలో నడువగలవు." స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచట మన మాలోచించవలసిన విషయమిది. "శరీర మున్నన్నాళ్ళు బాబా బ్రతికి యుండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా?" లేదు. ఎల్లప్పుడు జీవించియే యున్నారు. వారు జననమరణముల కతీతులు. ఎవరయితే బాబా నొకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్క డున్నప్పటికి ఎట్టి సమయమందుగాని బాబానుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడు మన ప్రక్కనే యుందురు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు.

బాలబువ సుతార్

బొంబాయిలో నుండు యోగియగు బాలబువ సుతార్ 1917వ సంవత్సరమున మొదటిసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్పభక్తుడు. వారెల్లప్పుడు ధ్యానము, భజన చేయుటచే వారిని 'నవయుగ తుకారామ్' అని పిలుచువారు. వారు బాబాకు నమస్కరించగా బాబా "నేనీతనిని నాలుగు సంవత్సరములనుండి యెరుగుదును." అనెను. తాను మొదటి సారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవా డగుటచే బాలబువ ఇదెట్లు సంభవమనుకొనెను. కాని తీవ్రముగా నాలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను. "యోగు లెంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు? తన భక్తులందు వారి కెంత ప్రేమ? నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి."

అప్పా సాహెబు కులకర్ణి

1917వ సంవత్సరమున అప్పాసాహెబు కులకర్ణివంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ యయ్యెను. బాలాసాహెబు భేటే అతనికి బాబా ఫోటో నిచ్చియుండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యమర్పించుచు బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే యని చెప్పవచ్చును. (దీనికి నిదర్శనము పైన జెప్పబడిన కథ).

కులకర్ణి ఠాణాలో నుండగా భివండి పర్యటనకు బోవలసివచ్చెను. ఒక వారమురోజుల లోపల తిరిగి వచ్చుట కవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు మూడవరోజున ఈ దిగువ యాశ్చర్యమయిన సంగతి జరిగెను. మధ్యాహ్నము 12గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి యింటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణిగారి భార్యాబిడ్డలు, వారు షిరిడీ సాయిబాబాగారా యని యడిగిరి. వారిట్లు నుడివిరి. "లేదు. నేను భగవంతుని సేవకుడను. వారి యాజ్ఞానుసారము మీ యోగ క్షేమములను కనుగొనుటకు వచ్చితిని." అట్లనుచు దక్షిణ నడిగెను. ఆమె ఒక రూపాయి నిచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఆమెకు ఊదీ నిచ్చి, దానిని పూజలో ఫోటోతో కూడ నుంచుకొని పూజించుమనిరి. పిమ్మట యిల్లు విడిచి వెళ్లిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు.

భివండిలో తన గుఱ్ఱము జబ్బుపడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్యవల్ల వినెను. ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఒక్కరూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుట కిష్టపడకుండెను. తానే యింటివద్ద నున్నచో 10రూపాయలకు తక్కువగాకుండ దక్షిణ యిచ్చి యుందుననెను. వెంటనే ఫకీరును వెదకుటకై బయలుదేరెను. మసీదులలోను, తక్కిన చోట్లను భోజనము చేయకయే వారికొరకు వెదకెను. అతని యన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహె బిచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమయన తరువాత చిత్రేయను స్నేహితునితో వాహ్యాళికి బయలుదేరెను. కొంతదూరము పోగా నెవరో వారివైపు త్వరగా వచ్చుచున్నట్లు గాన్పించెను. వారి ముఖలక్షణములనుబట్టి వారు తన యింటికి 12గంటలకు వచ్చినవారే యని యనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ నడిగెను. అప్పాసాహెబు ఒక రూపాయి నిచ్చెను. వారు తిరిగి యడుగగా ఇంకా రెండురూపాయ లిచ్చెను. అప్పటికి అతడు సంతుష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రేవద్దనుంచి మూడు రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారింకను దక్షిణ కావలెననిరి. అప్పాసాహెబు వారి నింటికి రావలసినదని వేడుకొనెను. అందరు ఇల్లు చేరిరి. అప్పాసాహెబు వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము తొమ్మిది రూపయలు ముట్టెను. అప్పటికి సంతుష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ యిమ్మనెను. అప్పాసాహెబు తనవద్ద పదిరూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి యిచ్చివేసి యక్కడనుండి వెడలెను. అప్పాసాహెబు పదిరూపాయలిచ్చెదననెను గనుక ఆ మొత్తమును దీసికొని పవిత్రపరచిన పిమ్మట తొమ్మిది రూపాయల నిచ్చి వేసెను. సంఖ్య 9 చాల ముఖ్యమైనది. అది నవవిధభక్తులను తెలియజేయును. (బాబా లక్ష్మీబాయి శిందేకు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి). అప్పాసాహెబు ఊదీ పొట్లమువిప్పి చూచెను. అందులో పువ్వుల రెక్కలును అక్షతలునుండెను. కొంత కాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక యొకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును, వెంట్రుకను, ఒక తాయెతులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊదీ ప్రభావము గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడయినప్పటికి నెలకు 40 రూపాయలు జీతము మాత్రమే దొరకుచుండెను. బాబా ఫోటోను, ఊదీని పొందిన తరువాత 40 రూపాయల కెన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు, అధికారమును లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తికూడ వృద్ధి యగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసినపిమ్మట ఊదీని నుదుట రాసికొని, కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగ భావించి పుచ్చుకొనవలెను.

హరి భాఉ కర్ణిక్

ఠాణా జిల్లా దహను గ్రామమునుండి హరిభాఉ కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురుపౌర్ణమినాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంచనములతో పూజించెను; వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామాద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను, అప్పుడే యింకొక రూపాయి బాబాకు దక్షిణ నివ్వవలెనని తోచగా మసీదు మరల ఎక్కుచుండగా, బాబా సెలవుపొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని యింటికి బయలు దేరెను. మార్గమధ్యమున నాసిక్ లో కాలా రాముని మందిరము ప్రవేశించి, దర్శనము చేసికొని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడచిలోపలనుండి బయటకు వచ్చి, హరి భాఉ ముంజేతిని బట్టుకొని "నా రూపాయి నాకిమ్ము" అనెను. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా నిచ్చి, సాయిబాబా యివ్వధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహారాజుద్వారా గ్రహించెననుకొనెను.

యోగీశ్వరులంద రొకటే యనియు, ఏకాత్మతాభావముతో కార్యము లొనర్తురనియు నీకథ తెలుపుచున్నది.

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదిమూడవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|
V. Rama Aravind.
2009-12-09.
Posted on: 2009-12-10. (100th anniversary of
Baba's Chavadi's Procession in Shirdi.
First started on 1909-12-10.)
Last updated on 2011-11-08.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me