Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook


Topic 43

శ్రీ సాయి సత్ చరిత్రము
43, 44 అధ్యాయములు
Shri Sai Satcharitra - Chapters 43 & 44

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

43, 44 అధ్యాయములు

బాబా సమాధి చెందుట

1. సన్నాహము 2. సమాధిమందరిము 3. ఇటుకరాయి విరుగుట 4. 72 గంటల సమాధి 5. జోగుయొక్క సన్యాసము 6. అమృతము వంటి బాబా పలుకులు

43, మరియు 44 అధ్యాయములు కూడ బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించునవి కనుక వాటినొకచోట చేర్చుట జరిగినది.

ముందుగా సన్నాహము

హిందువులలో నెవరైన మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు, మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారము. ఏలన ప్రపంచ విషయములనుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమొనర్చినచో నతడు పరమును సహజముగాను, సులభముగాను పొందును. పరీక్షిన్మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి, వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా నున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవతపురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికిని అలవాటులో నున్నది. చనిపొవుటకు సిద్ధముగా నున్నవారికి గీతా, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని యవతారమగుటచే వారికట్టిది యవసరము లేదు. కాని, యితరులకు ఆదర్శముగా నుండుటకు ఈయలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగనే వారు వజే యను నాతని బిలిచి రామవిజయమను గ్రంథమును పారాయణ చేయుమనిరి. అతడు వారములో గ్రంథము నొకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా యాజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు చదివి దానిని మూడు దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈ విధముగా 11 దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈ విధముగా 11 దినములు గడచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి యలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధాములో మునిగి చివరి క్షణముకయి యెదురు చూచుచుండిరి.

రెండుమూడుదినముల ముందునుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరవరకు బాబా చైతన్యముతో నుండి, అందరిని ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయెదరో ఎవరికిని తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబు దీక్షితు, శ్రీమాన్ బుట్టీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు (అక్టోబరు 15వ తారీఖు) హారతి పిమ్మట వారిని వారివారి బసలకుబోయి భోజనము చేయుమనెను. అయినను కొంతమంది లక్షీబాయి శిందే, భాగోజి శిందే, బాయాజి, లక్షణ్ బాలాషింపి, నానాసాహెబు నిమోన్కర్ యక్కడనే యుండిరి. దిగువ మెట్లమీద శ్యామా కూర్చొనియుండెను. లక్షీబాయి శిందేకు 9 రూపాయలను దానము చేసినపిమ్మట, బాబా తనకాస్థలము (మసీదు) బాగలేదనియు, అందుచేత తనను రాతితో కట్టిన బుట్టీ మేడలోనికి దీసికొని పోయిన నచట బాగుగా నుండుననియు చెప్పెను. ఈ తుదిపలుకు లాడుచు బాబా బాయాజీ శరీరముపై ఒరిగి ప్రాణములు విడిచెను. భాగోజీ దీనిని గనిపెట్టెను. దిగువ కూర్చొనియున్న నానాసాహెబు నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబు నీళ్ళు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా! యని యరచెను. బాబా తన భౌతికశరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను.

బాబా సమాధి చెందెనని సంగతి శిరిడి గ్రామములో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరు స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి యేడ్వసాగిరి. కొందరు బిగ్గరగా నేడ్చిరి. కొందరు వీథులలో నేడ్చుచుండిరి. కొందరు తెలివితప్పి పడిరి. అందరి కండ్లనుండి నీళ్ళు కాలువలవలె పారుచుండెను. అందరును విచారగ్రస్తు లయిరి.

కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొన మొదలిడిరి. మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యెదనని బాబా తమ భక్తులతో చెప్పిరని యొకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక నెవ్వెరును సందేహింప నక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణు వీ కార్యమే యొనర్చెను. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీ కృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ యవతారమున శ్రీ కృష్ణుడు భూమిభారమును తగ్గించెను. ఈ యవతారము (సాయిబాబా) భక్తుల నుద్ధరించుటకై వచ్చినది. కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ లగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధ మీయొక్క జన్మతోడిదే కాదు, అది కడచిన డెబ్బెదిరెండు జన్మల సంబంధము. ఇట్టి ప్రేమబంధములు కల్గించిన యా మహారాజు (సాయిబాబా) ఎచటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శ్రీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢవిశ్వాసము భక్తులకు గలదు.

బాబా శరీరమునెట్లు సమాధి చేయవలెనను విషయము గొప్ప సమస్య యాయెను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధిచేసి దానిపై గోరి కట్టవలె ననిరి. ఖుషాల్ చంద్, అమీరుశక్కర్ కూడ ఈ యభిప్రాయమునే వెలుబుచ్చిరి. కాని రామచంద్ర పాటీలు అను గ్రామమునసబు గ్రామములోని వారందరికి నిశ్చితమైన దృఢకంఠస్వరముతో "మీ యాలోచన మా కసమ్మతము. బాబా శరీరము రాతి వాడాలో పెట్టవలసినదే" యనిరి. అందుచే గ్రామస్థులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి.

బుధవార ముదయము గ్రామములోని జ్యోతిష్కుడును, శ్యామాకు మేనమామయునగు లక్ష్మణ్ మామాజోషికి బాబా స్వప్నములో గాన్పించి, చేయిపట్టి లాగి యిట్లనెను. "త్వరగా లెమ్ము, బాపుసాహెబు నేను మరణించితి ననుకొనుచున్నాడు. అందుచే నతడు రాడు. నీవు పూజ చేసి, కాకడహారతిని ఇమ్ము." లక్ష్మణ మామా సనాతనాచారపరాయణుడయిన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణభక్తివిశ్వాసము లుండెను. ఈ దృశ్యమును చూడగనే పూజాద్రవ్యములు పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను, హారతి చేసి పోయెను. మిట్ట మధ్యాహ్నము బాపుసాహెబు జోగ్ పూజాద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను.

బాబా తుదిపలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమును త్రవ్వుట ప్రారంభించిరి, మంగళవారము సాయంకాలము రాహాతానుండి సబ్ ఇన్ స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలములనుండి వచ్చిరి. అందరు దానిని ఆమోదించిరి. ఆమరుసటి యుదయము అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్ గాం నుండి మామలతుదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి. కనుక, మామలతుదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలె ననెను. వాడా నుపయోగించుటకు రెండు రెట్లుకంటె ఏక్కువవోట్లు వచ్చెను. అయినప్పటికి జిల్లాకలెక్టరుతో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకాసాహెబు దీక్షిత్ అహమద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణవల్ల రెండవ పార్టియొక్క మనస్సు మారెను. అందరు ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధిచేయుట కంగీకరించిరి. బుథవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసికొనిపొయిరి. మురళీధర్ కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యాదార్ధముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయ మయ్యెను. అది యొక పూజామందిర మాయెను. అనేకమంది భక్తులచ్చటకు బోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబు భాటే, ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసని బాబా, బాబాకు గొప్పభక్తుడు.

ఈ సందర్భములో నొక విషయము గమనించవలెను. ప్రొఫెసరు నార్కే కథనము ప్రాకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టి నప్పటికి అది బిగిసిపోలేదు. అవయవములన్నియు సాగుచుండెను. వారి కఫినీ చింపకుండ సులభముగా దీయగలిగిరి.

ఇటుకరాయి విరుగుట

బాబా భౌతికశరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకున మయ్యెను. మసీదులో ఒక పాత యిటుక యుండెను. బాబా దానిపై చేయివేసి యానుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని యాసనస్థులగు చుండిరి. అనేక సంవత్సరము లిట్లు గడచెను. ఒకనాడు, బాబా మసీదులో లేనప్పుడు, ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు, దానిని చేతితో పట్టుకొనియుండగా అది చేతినుండి జారి క్రిందపడి రెండుముక్కలయి పోయెను. ఈ సంగతి బాబాకు తెలియగనే వారు మిగుల చింతించి యిట్లని యేడ్చిరి. "ఇటుక కాదు, నా యదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడునీడ. దాని సహాయమువలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో, దానియందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడచినది." ఎవరైన ఒక ప్రశ్న నడుగవచ్చును. "బాబా నిర్జీవియగు ఇటుకకోసమింత విచారపడనేల?" అందులకు హేమడ్ పంతు ఇట్లు సమాధాన మిచ్చెను. "యోగులు బీదవారికి, నిస్సహాయులకు సహాయముచేయుటకై యవతరించెదరు. వారు ప్రజలతో కలసి మసలునప్పుడు ప్రజలవలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధచైతన్యులయి వారి కర్తవ్యవిధుల నెరుగుదురు”.

72 గంటల సమాధి

ఇటుక విరుగుటకు 32 సంపత్సరములకు పూర్వమందు అనగా, 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిరపౌర్ణమి నాడు బాబా ఊబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి దీసికొనిపోయి సమాధిలో నుంచవలెననుకొని, భక్త మహళ్సాపతితో నిట్లనిరి. "నా శరీరమును మూడు రోజులవరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయిన సరే, లేనియెడెల నా శరీరము నెదురుగా నున్న ఖాళి స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము" అని స్థలమును జూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడికూడ ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరివారందరచ్చట చేరి న్యాయవిచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహళ్సాపతి యడ్డగించెను. తన తొడపై బాబా శరీరము నుంచుకొని మూడురొజూలట్లే కాపాడుచు కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు గనిపించెను. ఊపిరి ఆడ నారంభించెను. కడపు కదలెను, కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను.

దీనినిబట్టి చదువరు లాలోచించవలసిన విషయమేమన బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీర మశాశ్వతము గాని, లోనున్న యాత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధసత్తాయే బ్రహ్మము, అదియే పంచేంద్రియములను, మనస్సును స్వాధీనమందుంచుకొనునది, పరిపాలించునది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువు లన్నిటి యందు వ్యాపించి యున్నది. అది లేనిస్థలము లేదు. అది తాను సంకల్పించు కొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతికశరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట, శరీరమును విడిచెను. సాయి యెల్లప్పుడు ఉండు వారు. అట్లనే పూర్వము గాణ్గాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు. వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని, సమస్తచేతనాచేతనములందు గూడ నుండి వానిని నియమించువారును, పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్యశరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగ భక్తితో పూజించువారికిని అనుభవనీయమయిన సంగతి.

ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేనప్పటికిని, మనము షిరిడీకి వెళ్ళినచో, వారి జీవిత మెత్తుపటము మసీదులో నున్నది. దీనిని శ్యామారావు జయకర్ యను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడూ నైన ప్రేక్షకునికి ఈ పటము ఈ నాటికిని బాబాను భౌతికశరీరముతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతికశరీరము లేనప్పిటికి వారక్కడనేకాక ప్రతి చోటున నివసించుచు పూర్వమువలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబావంటి యోగులు ఎన్నడు మరణించరు. వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము.

బాపుసాహెబు జోగ్ గారి సన్యాసము

జోగు సన్యాసము పుచ్చుకొనినకథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నాడు. సఖారాం హరి, పురఫ్ బాపుసాహెబ్ జోగ్ పునా నివాసియగు సుప్రసిద్థ వార్కరి విష్ణు బువ జోగ్ గారికి మామ. 1909వ సంవత్సరమున సర్కారు ఊద్యోగమునుండి విరమించిన తరువాత (P.W.D. Supervisor), భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి, బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట, బాపుసాహెబు జోగ్ మసీదులోను, చావడిలోను కూడ బాబా మహాసమాధి పొందువరకు హారతి ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతమును చదివి, వినవచ్చిన వారందరికి బోధించుచుండెను. అనేకసంవత్సరములు సేవచేసినపిమ్మట జోగ్, బాబాతో "నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని. నా మనస్సు ఇంకను శాంతము కాలేదు యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు?" అనెను. ఆ ప్రార్థన విని, బాబా "కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును. నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవభిమానమును పోగొట్టుకొని, మోహమును, రుచిని, జయించెదవో, యాటంకము లన్నిటిని కడచెదవో, హృదయపూర్వకముగ భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు" అనిరి. కొద్ది కాలముపిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికింకొక యభిమానమేదియు లేకుండుటచే నతడు స్వేచ్చాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను.

అమృతతుల్యమగు బాబా పలుకులు

దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈదిగువ మధురవాక్యములు పలికిరి. "ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియు చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే యెల్లప్పుడు జపించుచుండును. ఎవరయితే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను. వారికి మోక్షము నిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే యేమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడియుందును. ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో, వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములో నున్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను."

నేననగా నేవరు?

నేను అనగా నెవ్వరో సాయిబాబా యెన్నోసార్లు బోధించెను. వారిట్లనిరి. "నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ యాకారము విడిచినచో నీలోనేగాక యన్ని జీవులలోను, చైతన్యము లేదా యంతరాత్మ యని యొకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోను నన్ను జూడుము. దీనిని నీవభ్యసించినచో, సర్వవ్యాపకత్వ మనుభవించి నాలో ఐక్యము పొందెదవు."

హేమడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమన వారు వినయవిధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక! బాబా పెక్కుసారులు "ఎవరయితే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించినవారగుదురు. ఎవరయితే బాధలనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు" అని చెప్పిరిగదా! బాబా సర్వవస్తుజీవసముదాయములో నైక్యమైయున్నారు. భక్తులకు నలుప్రక్కలనిలచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియు కోరరు. ఇట్టి శుభమయిన పరిశుభ్రమయిన యమృతము వారి పెదవులనుండి స్రవించుచుండెను. హేమడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులును సాయితో నైక్యమగుదురు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
43, 44 అధ్యాయములు సంపూర్ణము.

ఆరవరోజు పారాయణము సమాప్తము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

V Rama Aravind,
2007-03-18 (2 Days Before Ugadi)
Posted on: 2007-03-31.
Last updated on: 2011-11-10.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me