Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook


Topic 53

శ్రీ సాయి సత్ చరిత్రము
నాలుగవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 4

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నాలుగవ అధ్యాయము

యోగీశ్వరుల కర్తవ్యము - షిరిడీ పుణ్యక్షేత్రము - సాయిబాబా యొక్క రూపురేఖలు - గౌలిబువా గారి వాక్కు - విఠల్ దర్శనము క్షీరసాగరుని కథ - దాసగణు ప్రయాగ స్నానము - సాయిబాబా అయోని సంభవము - షిరిడీకి వారి మొదటిరాక - మూడు బసలు.

యోగీశ్వరుల కర్తవ్యము

భగవద్గీత చతుర్థాధ్యాయమున 7, 8, శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. "ధర్మము నశించునపుడు అధర్మము వృద్ధిపొందునపుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు, యుగయుగములందు అవతరించెదను". ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్ల అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారి హక్కులను అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక యవమానించునపుడు, ఎవరును మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని యనుకొనునపుడు, జనులు నిషిద్ధాహారములు త్రాగుడులకలవాటుపడినపుడు, మతము పేరుతో కానిపనులు చేయునపుడు, వేర్వేరు మతములవారు తమలోతాము కలహించునపుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునపుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనపుడు, ప్రజల ధనదారాసంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్షమార్గమును మరచునపుడు, యొగీశ్వరులుద్భవించి వారి వాక్కాయకర్మలచే ప్రజలను సవ్యమార్గమున బెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్తంభములవలె సహాయపడి, మనము నడువవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయీ, ఏకనాథుడు, తుకారము, నరహరి, నర్సిబాయి, సజన్ కా సాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగాగల యోగులను, తదితరులును వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును జూపిరి. అట్లే సాయిబాబాగూడ సకాలమందు షిరిడీ చేరిరి.

షిరిడీ పుణ్యక్షేత్రము

అహమదునగరు జీల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాల పుణ్యతమములు. ఏలయన నచ్చట ననేకులు యోగులుద్భవించిరి, నివాసము చేసిరి. అట్టివారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు. షిరిడీ అహమదునగరు జిల్లాలోని కోపర్ గాం తాలూకాకు చెందినది. కోపర్ గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నదిదాటి 3 కోసులు పోయినచో నీమగాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల గాణగాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగాగల పుణ్యక్షేత్రముల వలె షిరిడీకూడ గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున నున్న మంగళవేధ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగడ యందు సమర్థ రామదాసు, నర్సోబాచీవాడీయందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్ర మొనర్చెను.

సాయిబాబా రూపురేఖలు

సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా యెట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమునుదాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవభక్తుల కిల్లువంటివారు; నశించు వస్తువులయందభిమానము లేనివారు; భూలోక మందుగాని, స్వర్గలోకమందుగాని గల వస్తువులయందభిమానము లేనివారు. వారి యంతరంగము అద్దమువలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి యమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు, వారికి సమానమే. మానావమానములను లెక్కించినవారుకారు; అందరికి వారు ప్రభువు. అందరితో కలసిమెలసి యుండెడివారు. ఆటలు గాంచెడివారు; పాటలును వినుచుండెడివారు; ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగనిద్రయందుండెడి వారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి యంతరంగము లోతయిన సముద్రమువలె ప్రశాంతము, వారి యాశ్రమము, వారి చర్యలు ఇదమిత్థముగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండునప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నియు వారికి తెలియును, వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందలకొలది కథలు చెప్పునప్పటికి మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడు మసీదుగోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండీ తోట వైపుగాని చావడి వైపుగాని పచారు చేయుచుండెడివారు. ఎల్లప్పుడు ఆత్మధ్యానమునందే మునిగి యుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకునివలె నటించువారు. అణకువ, నమ్రత కలిగి, యహంకారము లేక యందరిని సంతసింప జేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీనేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. ఆళందిని జ్ఞానేశ్వరమహారాజు వృద్ధి చేసినట్లు, ఏకనాథు పైఠనును వృద్ధిచేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధిచేసెను. శిరీడీలోని గడ్డి, రాళ్ళు పుణ్యము చేసికొన్నవి. ఏలయిన బాబా పవిత్రపాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసికొనగలిగినవి. మావంటి భక్తులకు షిరిడీ, పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశి, రామేశ్వరము, బదరి కేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణములవంటిదయినది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణము తంత్రమును. అది మాకు సంసారబంధముల సన్నగిలచేసి యాత్మసాక్షాత్కారమును సులభసాధ్యము చేసెను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగసాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణీప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మాపాలిటి శ్రీ కృష్ణుడుగ, శ్రీ రాముడుగ నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు; నిరుత్సాహముగాని ఉల్లాసముగాని యెరుగరు. వారు ఎల్లప్పుడు సత్చిదానందస్వరూపులుగా నుండెడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా, భక్తులన్ని దేశములనుండి షిరిడీ చేరి, వారిని దర్శించి వారి యాశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడిది. పండరీపురమందు విఠల్ రఖుమాయిని దర్శించినచో భక్తలకు కలిగెడి యానందము షిరిడీలో దొరకుచుండెడిది. ఇది యతిశయోక్తి కాదు. ఈ విషయముగూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు.

గౌలిబువా అభిప్రాయము

95 సంవత్సరములు వయస్సుగల గౌలిబువ యను వృద్ధ భక్తుడొకడు పండరీయాత్ర ప్రతిసంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందును, మిగత నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తికమువరకు గంగానది యొడ్డునను ఉండెడివాడు. సామాను మోయుట కొక గాడిదను, తోడుగా నొకశిష్యుని తీసికొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చెసికొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబావైపు చూచి యిట్లనెను. "వీరు పండరీనాథుని యవతారమే! అనాథలకొరకు, బీదలకొరకు, వెలసిన కారుణ్యమూర్తి." గౌలిబువా వీఠోబాదేవుని ముసలి భక్తుడు. పండిరియాత్ర యెన్నిసారులో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని యవతారమని నిర్ధారణ పరచిరి.

విఠలదేవుడు దర్శనమిచ్చుట

సాయిబాబకు భగవన్నామస్మరణయందును, సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అని యనెడివారు. అనగా అల్లాయే యజమాని. ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామస్నరణ చేయించు చుండెడివారు. దీనినే నామసప్తాహ మందురు. ఒకప్పుడు దాసుగణు మహారాజును నామసప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్ధాన మిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసుగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయివేసి "తప్పనిసరిగ దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తిప్రేమలతో నుండవలెను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీ కృష్ణుని ద్వారకాపట్టణము, ఇక్కడనే యనగా షిరిడీలోనే యున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించునపుడు విఠలుడిక్కడనే యవతరించును" అనెను.

సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ క్రిందివిధముగా దర్శనమిచ్చెను. స్నానాంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్న హారతికొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా బాబా యిట్లడిగెను. "విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రము అజాగ్రత్తగ నున్నను తప్పించుకొని పారిపోవును." ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25, 30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని జూచి బాబామాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను.

భగవంతరావు క్షీరసాగరుని కథ

విఠలపూజయందు బాబాకెంత ప్రీతియో, భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు యాత్రచేయుచుండెడివాడు. ఇంటివద్ద కూడ విఠోబా ప్రతిమనుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు, బాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకొని; "వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడ ఆకలితో మాడ్చినాడు. అందుచేత వీని నిక్కడకు తెచ్చితిని. వీడు చెయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను" అనిరి.

ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము

గంగానది యమునానది కలియుచోటునకు ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగణు అచ్చటికిపోయి స్నానము చేయవలెనని మనస్సున దలచెను. బాబావద్దకేగి యనుమతించు మనెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. "అంతదూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ యిచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము." ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటె నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసుగణు మహారాజు బాబా పాదములపై శిరస్సునుంచిన వెంటనే బాబా రెండుపాదముల బొటన వ్రేళ్ళనుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును దాసుగణు చూచి ఆశ్చర్యనిమగ్నుడై, భక్తి ప్రైమలతో మైమరచి కంట తడి పెట్టుకొనెను. ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాట రూపముగా వర్ణించి పొగడెను.

బాబా అయోనిసంభవుడు; షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట

సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని జన్మస్థానమును గూర్చిగాని యెవరికి ఏమియు తెలియదు. పెక్కుసారులు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కుసారులీ విషయము బాబాను ప్రశ్నించిరి గాని యెట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు, సామాన్యమానవులవలె జన్మించియుండలేదు. ముత్యపు చిప్పలలో చిన్నపాపలవలె చిక్కిరి. నామదేవు భీమరథి నదిలో గొణాయికి కనిపించెను. కబీరు భాగీరథీనదిలో తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తులకొరకు 16 ఏండ్ల బాలుడుగా షిరిడీలోని వేపచెట్టు క్రింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. స్వప్నావస్థయందయినను ప్రపంచవస్తువులను కాక్షించెడివారుకాదు. మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించు చుండెను. నానాచోవ్ దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది. "ఈ చక్కని చురుకైన, అందమైనకుర్రవాడు వేపచెట్టుక్రింద ఆసనములోనుండెను. వేడిని, చలిని లెక్కింపక యంతటి చిన్నకుర్రవాడు కఠినతప మాచరించుట సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రియందెవరికి భయపడువాడు కాడు. చూచినవారశ్చర్యనిమగ్నులై యీ చిన్న కుఱ్ఱవా డెక్కడనుండి వచ్చినాడని యడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాల అందముగ నుండెను. ఒక్కసారి చూచినవారెల్లరు ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్న బాలునివలె గాన్పించినప్పటికిని చేతలనుబట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతనిగూర్చి యెవరికి నేమి తెలియకుండెను." ఒకనాడు ఖండోబా దేవు డొకని నావేశించగా నీబాలు డెవడయి యుండునని ప్రశ్నించిరి. వాని తల్లి దండ్రు లెవరని యడిగిరి. ఎచ్చటి నుండి వచ్చినాడని యడిగిరి. ఖండోబా దేవుడొక స్థలమునుచూపి గడ్ఢపారను దీసికొని వచ్చి యచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా నిటుకలు, వాని దిగువ వెడల్పు రాయి యొకటి గాన్పించెను. అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను. ఆ సందు ద్వారా పోగా నొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కఱ్ఱబల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు నభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుఱ్ఱవాని నీ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి యచ్చట గలదు గావున దానిని గాపాడవలెననియు చెప్పెను. వెంటనె దాని నెప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ, ఉదుంబర, వృక్షములవలె నీ వేపచెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. షిరిడీలోని భక్తులు, మహాళ్సాపతియు దీనిని బాబాయొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగనమస్కారములు చేసెదరు.

మూడు బసలు

వేపచెట్టును, దానిచుట్టునున్న స్థలమును హరివినాయకసాఠే అను వాడు కొని సాఠెవాడ యను పెద్ద వసతిని గట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలి కిది యొక్కటియే నివాసస్థలము, వేపచెట్టు చుట్టు అరుగు ఎత్తుగా కట్టిరి. మెట్లు కట్టిరి. మెట్ల దిగువన నొక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తరముఖముగా కూర్చొనెదరు. ఎవరిచ్ఛట గురువారము; శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాల పురాతనమైనది. కావున మరామత్తునకు సిద్థముగా నుండెను. తగిన మార్పులు, మరామత్తులు సంస్థానమువారు చేసిరి.

కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడాయను పేరుతో కట్టిరి. న్యాయవాది కాకాసాహెబు దీక్షిత్ ఇంగ్లండుకు బోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలుకుంటుపడెను. అది యెంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానా సాహెబు చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా యిచ్చెను. 1909వ సంవత్సరమున కాకా బాబావద్దకు బోయి కాలు కుంటితనము కన్న తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించెను. బాబా దర్శనమాత్రమున అమితానందభరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. తనకొరకును, ఇతరభక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడను నిర్మించెను. 10-12-1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను. (1) దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. (2) చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911వ సంవత్సరములో శ్రీరామ నవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి.

తరువాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియగు బుట్టీ మరియొక పెద్దరాతిమేడను నిర్మించెను. చాల ద్రవ్యము దీనికొరకు వెచ్చించెను. ద్రవ్యమంతయు దానికై సవ్యముగా వినియోగపడెను. ఏలయన బాబాగారి భౌతికశరీరమందులో సమాధిచేయబడినది. దీనినే సమాధిమందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసెడివారు.

ఇట్లు మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడెను. అంతకుముందిచ్చట నొక్క వసతిగృహము కూడ లేకుండెను. అన్నిటికంటె సాఠేవాడ చాలా ఉపకరించుచుండెను.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నాలుగవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

V Rama Aravind,
2007-11-24.
Posted on: 2008-01-31.
Last updated on: 2011-11-05.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me