Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook


Topic 59

శ్రీ సాయి సత్ చరిత్రము
పదియవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 10

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

పదియవ అధ్యాయము

సాయిబాబా జీవితము తీరు; వారి పండుకొను బల్ల; షిరిడీలో వారి నివాసము; వారి బోధలు; వారి యణకువ; అతిసులభ మార్గము

ఎల్లప్పుడు సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తియందుంచు కొనుము. ఏలన వారు ప్రతి మనుజునకు మేలు చేయుటయందే లీనమై యుండువారు; ఎల్లప్పుడు ఆత్మధ్యానములో మునిగియుండేవారు. వారిని జ్ఞప్తియందుంచుకొనుటయే జీవన్మరణముల సమస్యకు పరిష్కారము చేసి నట్లగును. సాధనము లన్నిటిలో నిదియే గొప్పది; అతి సులభమైనది; వ్యయ ప్రయాసలు లేనిది. కొద్ది శ్రమవలన గొప్ప ఫలితము పొందవచ్చును. అందువలన మన బుద్ధి సరిగా నున్నప్పుడే ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించవలెను. ఇతరదైవతములు కొలువు భ్రమ. గురువొక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన యదృష్టమును బాగుచేయగలరు. మనము వారిని బాగుగా సేవించినచో సంసారబంధములనుండి తప్పించుకొనగలము. న్యాయ శాస్త్రము, మీమాంస మొదలగునవి చదువ నవసరము లేదు. కష్టములు, విచారములు అనే సముద్రములో వారిని మన జీవిత కర్ణధారిగా జేసి కొన్నచో మనము సులభముగా ఈ సాగరమును దాటగలము. సముద్రములు, నదులు దాటునపుడు మనము ఓడ నడపేవాని యందు నమ్మకముంచినట్లు, సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మక ముంచవలెను. సద్గురువు భక్తులయొక్క యాంతరంగిక ప్రేమ-భక్తులను గమనించి, వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును.

గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, భక్తుల యనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయములో బాబా యెక్కడుండెను? ఏలాగుండెను? ఎట్లు పండుకొనుచుండెను? ఎట్లు బోధించుచుండెను? మెదలగునవి చెప్పుదుము.

బాబావారి విచిత్రశయ్య

మొట్టమొదట బాబా యెచ్చట పండుకొనుచుండెనో చూచెదము. నానాసాహెబు డేంగ్లే బాబా నిద్రించుటకై యొక కర్రబల్లను తెచ్చెను. దాని పొడవు నాలుగు మూరలు, వెడల్పు ఒక జానెడు మాత్రమే యుండెను. ఆ బల్లను నేలపై వేసి పండుకొనుటకు మారుగా, దానిని మసీదుయొక్క వెన్నుపట్టెలకు ఉయ్యలవలె వ్రేలాడునట్లు పాత చినిగిన గుడ్డపీలికలతో గట్టి బాబా పండుకొన మొదలిడెను. గుడ్డపీలికలు పలుచనివి, బలములేనట్టివి. అవి బల్లయొక్క బరువును ఎట్లు మోయగలిగెనో యనునది గొప్ప సమస్యగా నుండెను. ఇంకను బాబా యొక్క బరువును కూడ కలిపినచో నవి యెట్లు భరించుచుండె ననునది యాశ్చర్యవినోదములకు హేతువయ్యెను. ఎలాగునైతే నేమి యిది బాబా లీలలలో నొకటి యగుటచే పాతగుడ్డ పీలికలే యంత బరువును మోయగలిగెను. ఈ బల్ల యొక్క నాలుగు మూలలయందు నాలుగు దీపపు ప్రమిదలుంచి రాత్రియంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది యేమి చిత్రము! బల్లపై ఆజానుబాహుడగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా యెక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన యా దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే! ఆ బల్లపైకి బాబా యెట్లు ఎక్కుచుండెను? ఎట్లు దిగుచుండెను? అనునవి యందరకు నాశ్చర్యము కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి యెక్కుట, దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండెడివారు. కాని బాబా యెవరికి అంతు తెలియనివ్వలేదు. జనులు గుంపులు గుంపులుగ గుమిగూడుటచే బాబా విసుగుచెంది యా బల్ల నొకనాడు విరచి పారవైచెను. బాబా స్వాధీనములో అష్టసిద్ధు లుండెను. బాబా వాని నభ్యసించలేదు, కోరనులేదు. వారు పరిపూర్ణులు గనుక అవి సహజముగానే వారి కలవడెను.

బ్రహ్మముయొక్క సగుణావతారము

మూడున్నర మూరల పొడవు మనుష్యునివలె సాయిబాబా గాన్పించినను వారి అందరి మనములం దుండెడివారు. అంతరంగమున నిర్వామోహులు నిస్పృహులై నప్పటికి, బహిరంగముగా బాబా లోకులమేలుకోరువారు వానిగ గనిపించువారు. లోలోపల వారి కెవరియందును అభిమాన ముండెడిది కాదు. కాని బయటికి కోరికల పుట్టయన్నట్లు కనిపించువారు. అంతరంగమున శాంతమునకు ఉనికి పట్టయినను చంచల మనుష్కునివలె గనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్ధితి యున్నప్పటికి బయటకు దయ్యమువలె నటించుచుండెడివారు. లోపల యద్వైతి యైనను బయటకు ప్రపంచమునందు తగుల్కొనిన వానివలె గాన్పించు చుండెను. ఒక్కొక్కప్పుడందరను ప్రేమతో చూచెడివారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసరుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టు చుండిరి. ఇంకొకప్పుడు వారిని కౌగిలించుకొని నెమ్మదిగాను ఓరిమితోను చంచలము లేనివానివలెను గనిపించుచుండెను.

వారెల్లప్పుడు ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారు; భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు. వారెల్లప్పుడు నొకే యాసనమందు కూర్చుండువారు; ప్రయాణములు చేసెడివారు కారు. వారి దండము చిన్న పొట్టి కర్ర; దానిని సదా చేతిలో నుంచుకొనెడివారు. ఇతరమైన యాలోచనలేమియు లేక యెప్పుడు శాంతముగా నుండువారు. ఐశ్వర్యమును గాని, పేరు ప్రతిష్ఠలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే జీవించెడువారు. అట్టి జీవితము వారు గడిపిరి. ఎల్లప్పుడు 'అల్లా మాలిక్' యనెడివారు. భగవంతుడే యజమాని యని దాని భావము. భక్తులయందు సంపూర్ణప్రేమ కలిగి యుండెడివారు. ఆత్మజ్ఞానమునకు ఉనికిపట్టుగాను, దివ్యానందమునకు పెన్నిధిగాను గనుపించుచుండువారు. ఆద్యంతములు లేని యక్షయమైనట్టి, భేదరహితమై నట్టిది బాబాయొక్క దివ్యస్వరూపము. విశ్వమంతయు నావరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడీ సాయి యవతారముగా వెలసెను. నిజముగా పుణ్యులు, అదృష్టవంతులు మాత్రమే యా నిధిని గ్రహించ గలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజమైనశక్తిని కనుగొనలేనివారు, బాబాను సామాన్యమానవునిగా నెంచినవారు, ఇప్పటికి అట్లు భావించు వారు దురదృష్టవంతులని చెప్పవచ్చును.

షిరిడీలో బాబా నివాసము - వారి జన్మతేది

బాబాయొక్క తల్లిదండ్రులగురించి గాని, వారి సరియైన జన్మతేదీగాని యెవరికీ తెలియదు. వారు షిరిడీలో నుండుటనుబట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 యేండ్ల వయస్సున షిరిడీ వచ్చి మూడు సంవత్సరములు మాత్ర మచట నుండిరి. హఠాత్తుగా అచట నుండి అదృశ్యులై పోయిరి. కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున గనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటీలు పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటినుంచి 60 సంపత్సరములు షిరిడీవదలక యచ్చటనే యుండిరి. అటు పిమ్మట 1918వ సంపత్సరములో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించియుందురని భావింపవచ్చును.

బాబా లక్ష్యము, వారి బోధలు

17వ శతాబ్ధములో రామదాసను యోగిపుంగవుడు (1608-81) వర్ధిల్లెను. గో బ్రాహ్మణులను మహమ్మదీయులనుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగ నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వీరికి స్నేహము కుదుర్చుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడు వారు ఈ దిగువ సలహా ఇచ్చెడివారు. "హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయులదైవమగు రహీమును ఒక్కరే. వారిరువురిమధ్య యేమీ భేదములేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట యెందులకు? ఓ అజ్ఞానులారా! చేతులు-చేతులు కలిపి రెండు జాతులును కలిసిమెలిసి యుండుడు. బుద్ధితో ప్రవర్తింపుడు. జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదమువల్లగాని, ఘర్షణవల్లగాని ప్రయోజనములేదు. అందుచే వివాదము విడువుడు. ఇతరులతో పోటీ పడకుడు. మీయొక్క వృద్ధిని, మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో నేదైన అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైవ మీకు కీడుచేసినచో, ప్రత్యుపకారము చేయకుడు. ఇతరులకొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు." సంగ్రహముగా ఇదియే బాబా యొక్క బోధ. ఇది యిహమునకు పరమునకు కూడ పనికివచ్చును.

సాయిబాబా సద్గురువు

గురువులమని చెప్పుకొని తిరుగువా రనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ, చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మికాడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది, వారి వద్దనుంచి ధనము లాగెదరు. పవిత్రమార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కాని మత మనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారపవిత్రులు.

సాయిబాబా తన గొప్పతన మెన్నడును ప్రదర్శించవలె నను కొనలేదు. వారికి శరీరాభిమానము ఏమాత్రము లేకుండెను, కాని భక్తులయందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండెడిది. నియతగురువులని అనియతగురువులని గురువులు రెండు విధములు. నియతగురువులనగా నియమింపబడినవారు. అనియతగురువులనగా సమయానుకూలముగ వచ్చి యేదైన సలహానిచ్చి మన యంతరంగముననున్న సుగుణమును వృద్ధిచేసి మోక్షమార్గము త్రొక్కునట్లు చేయువారు. నియతగురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వాభిప్రాయము పోగొట్టి యోగమును ప్రతిష్ఠించి "తత్వమసి" యగునట్లు చేయును. సర్వవిధముల ప్రపంచజ్ఞానమును బోధించుగురువు లనేకులు గలరు. కాని మనల నెవరయితే సహజస్థితియందు నిలుచునట్లు జేసి మనలను ప్రపంచపుటునికికి అతీతముగా తీసికొని పోయెదరో వారు సద్గురువులు. సాయిబాబా యట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో, బాబా వారి యొక్క భూతభవిష్యద్వర్తమానము లన్నిటిని చెప్పువారు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును జూచేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. దుర్మార్గుల యవసరముల గూడ దీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. వారు మానవశరీరముతో నున్నప్పటికి, వారికి శరీరమందు గాని, గృహమందుగాని యభిమానము లేకుండెను. వారు శరీరధారులవలె గనిపించినను నిజముగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు.

బాబాను భగవానునివలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. తినుచు, త్రాగుచు, తమ దొడ్లలోను పొలములలోను పని చేసికొనుచు, వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తియందుంచుకొని సాయి మహిమను కీర్తించు చుండేవారు. సాయితప్ప యింకొక దైవమును వారెరిగియుండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు అజ్ఞాను లయినప్పటికి ప్రేమతో పాటలను కూర్చుకొని వారికి వచ్చు భాషాజ్ఞానముతో పాడుచుండిరి. వారికి అక్షరజ్ఞానము శూన్యమయినప్పటికి వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము తెలివివలన రాదు. కాని యది యసలైన ప్రేమవలన వెలువడును. సిసలైన కవిత్వము స్వచ్ఛమైన ప్రేమచే వెలువడును. బుద్ధిమంతు లది గ్రహించగలరు. ఈ పల్లె పాటలన్నియు సేకరింపదగినవి. ఏ భక్తుడయిన వీనిని శ్రీ సాయిలీల సంచికలో ప్రకటించిన బాగుండును.

బాబావారి యణకువ

భగవంతునికి ఆరు లక్షణములు గలవు. (1) కీర్తి, (2) ధనము, (3) అభిమానము లేకుండుట, (4) జ్ఞానము, (5) మహిమ, (6) ఔదార్యము. బాబాలో ఈ గుణములన్నియు నుండెను. భక్తులకొరకు శరీరరూపముగ అవతారమెత్తెను. వారి దయాదాక్షిణ్యములు వింతయినవి. వారు భక్తులను తనవద్దకు లాగుకొనుచుండిరి. లేనియెడల వారి సంగతి యెవరికి తెలిసియుండును? భక్తులకొరకు బాబా పలికిన పలుకులు సరస్వతీదేవి కూడ పలుకుటకు భయపడును. ఇందొకటి పొందుపరచు చున్నాము. బాబా మిక్కిలి యణకువతో నిట్లుపలికెను. "బానిసలలో బానిసనగు నేను మీకు ఋణస్థుడను. మీదర్శనముచే నేను తృప్తుడనై తిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ యశుద్ధములో నేనొక పురుగును. అట్లగుటవలన నేను ధన్యుడను." ఏమి వారి యణకువ! దీనిని ప్రచురించి బాబాను కించపరిచితినని ఎవరైన యనినచో, వారిని క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామజపము చేసెదను.

ఇంద్రియవిషయముల ననుభవించువానివలె బాబా పైకి కనిపించినను, వారికి వానియం దేమాత్రమభిరుచి యుండెడిది కాదు. అనుభవించు స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించునప్పటికి దేనియందు వారికి రుచి యుండెడిది కాదు. వారు చూచుచున్నట్లు గాన్పించినను వారికి చూచుదానియందు శ్రద్ధలేకుండెను. కామమన్నచో వారు హనుమంతునివలె యస్ఖలిత బ్రాహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్యస్వరూపులు. కోరిక, కోపము మొదలగు భావములకు విశ్రాంతి స్థలము. వేయేల వారు నిర్మములు; స్వతంత్రులు, పరిపూర్ణులు. దీనిని వివరించుట కొక యుదాహరణము.

నానావల్లి

షిరిడీలో విచిత్రపురుషు డొకడుండెను. అతనిపేరు నానావల్లి. అతడు బాబా విషయములను, పనులను చక్కపెట్టుచుండువాడు. ఒకనాడతడు బాబావద్దకు పోయి, గద్దెపైనుంచి బాబాను దిగుమని కోరెను. అతనికి దానిపై కూర్చుండ బుద్ధి పుట్టెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీచేసెను. నానావల్లి దానిపై కొంతసేపు కూర్చుండి, లేచి, బాబాను తిరిగి కూర్చొనుమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావల్లి బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీదనుంచి దిగి పొమ్మనినను దానిపై నింకొకరు కూర్చొనినను, బాబా యెట్టి యసంతుష్టి వెలిబుచ్చ లేదు. నానావల్లి యెంత పుణ్యాత్ముడో, భక్తుడో కాని బాబా మహాసమాధి చెందిన పదమూడవనాడాతడు దేహత్యాగము చేసెను.

అతిసులభ మార్గము

యోగీశ్వరుల కథాశ్రవణము; వారి సాంగత్యము
సాయిబాబా సామాన్యమానవునివలె నటించినప్పటికి వారి చర్యలనుబట్టి యసామాన్యమైన కౌశల్యము బుద్ధియు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తన భక్తుల మేలుకొరకే. వారు ఆసనములు గాని, యోగాభ్యాసములు గాని, మంత్రోపదేశములు గాని, తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివి తేటలను ప్రక్కకు బెట్టి సాయి, సాయి యను నామమును మాత్రము జ్ఞప్తియందుంచుకొనుమనిరి. అట్లు చేసినచో మీ బంధములనుండి విముక్తులై, స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి, పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగయోగము మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. అవి ఇతరవర్ణముల వారికి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది యాలోచించకుండ యొక్కనిముషమైన నుండలేదు. దానికేదైన ఇంద్రియవిషయము జ్ఞప్తికి దెచ్చినచో, దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి దెచ్చినచో, దానినే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తియందుంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి వూజయు కీర్తనయు.

యోగీశ్వరుల కథలను వినుట పైనచెప్పిన ఇతరసాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభసాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయము లన్నిటిని పారద్రోలి పారమార్థికమార్గమునకు దీసికొనిపోవును. కాబట్టి యీ కథలను వినుడు. వానినే మననము చేయుడు, జీర్ణించుకొనుడు. ఇంతమాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీలు, తక్కిన జాతులవారు కూడ పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగుల్కొని యున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు, వారి కథలు వినుడు. వారు తప్పక నిన్ను ఆశీర్వదించగలరు. ఇది మిక్కిలి సులభమయిన మార్గము. అయితే యందరు దీని నెందు కవలంబించరు? అని యడుగవచ్చు. కారణమేమన; భగవంతుని కృపాకటాక్షము లేనియెడల యోగుల చరిత్రలను వినుటకు మనస్సు అంగీకరించదు. భగవంతుని కృపచే సర్వము నిరాటంకము, సులభము. యోగీశ్వరుల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే. యోగీశ్వరుల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాల గొప్పది. అది మన యహంకారమును, శరీరాభిమానమును నశింపజేయును; చావు పుట్టుకలనే బంధములను కూడ నశింపజేయును; హృదయగ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధచైతన్యరూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసికొని పోవును. విషయవ్యామోహముల యందలి మన యభిమానమును తగ్గించి, ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థికమార్గమున నడుపును. మీకు భగవన్నామస్మరణయు, పూజ, భక్తివంటి యితరసాధనములు లేనియెడల, యోగీశ్వరుల యాశ్రయమునే జేయుదురు. అందుకొరకే యోగీశ్వరులు వారంతటవారు భూమిపై నవతరించుదురు. ప్రపంచపాపముల తొలగ జేయునట్టి గంగా, గోదావరి, కృష్ణా, కావేరి మున్నగు వవిత్రనదులు కూడ, యోగులు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని భావించుచుండును. అట్టిది యోగుల వైభవము. మన పూర్వజన్మ సుకృతముచే మనము సాయిబాబా పాదములను బట్టితిమి.

ఈ అధ్యాయమును సాయిబాబా రూపమును ధ్యానించుచు ముగించెదము.

"మసీదుగోడ కానుకొని ఊదీమహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందరస్వరూపుడును, ఈ ప్రపంచము మాయ యని చింతించువాడును, పరిపూర్ణానందములో మునిగియుండు వాడునగు సాయి పాదములకు సాష్టాంగనమస్కారములు."

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
పదియవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

V Rama Aravind.
2008-08-08.
Posted on: 2008-08-30.
Last updated on: 2011-11-05.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me