Topic 64
శ్రీ సాయి సత్ చరిత్రము
పదునైదవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 15
ఓం
శ్రీ సాయి నాథాయ నమః
శ్రీ
సాయిబాబా
జీవిత చరిత్రము
పదునైదవ అధ్యాయము
నారదీయ కీర్తనపద్ధతి; చోల్కరు చక్కెరలేని టీ; రెండు బల్లులు.
6వ అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీ రామనవమి యుత్సవముగూర్చి చెప్పితిమి. ఆ యుత్సవమెట్లు ప్రారంభమయ్యెను? ఆ సమయములో హరిదాసును దెచ్చుట యెంత కష్టముగ నుండెడిది? తుదకు ఆ పనిని దాసుగణు మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటివరకు దాసుగణు జయప్రదముగా నడుపుట యనునవి. (చదువరులు జ్ఞాపకముంచుకొనియే యుందురు.) ఈ అధ్యాయములో దాసుగణు హరికథల నెట్లు చెప్పువారో వర్ణింపబడును.
నారదీయకీర్తన పద్ధతి
సాధారణముగ మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసికొనెదరు. తల పైని పాగా గాని, పేటా (ఒక విధమైన యెర్రని మహారాష్ట్రపు టోపి) కాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన నుత్తరీయము, మామూలుగా ధరించెడి దోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి, షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగణు తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై బాబా వద్దకు బోయెను. బాబా ఆతనితో "ఓ పెండ్లికొడుకా! ఇంత చక్కగ దుస్తులు వేసికొని యెక్కడకు పోవుచున్నావు?" అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసుగణు జవాబిచ్చెను. అప్పుడు బాబా యిట్లనియె. "ఈ దుస్తులన్ని యెందుకు? కోటు, కండువా, టోపి మొదలగునవి నాముందర వెంటనే తీసి పారవేయుము. శరీరము పైనివి వేసికొనకూడదు." వెంటనే దసుగణు వానినన్నిటిని తీసి బాబా పాదములవద్ద నుంచెను. అప్పటినుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసుగణు ధరించలేదు. నడుము మొదలు తలవరకు ఏమియు వేసికొనలేదు. చేతిలో చిరుతలు మెడలో పూలమాల ధరించేవాడు. ఇది తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారదమహర్షియే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపైని, శరీరముపైని యేమియు తొడిగేవారు కారు. చేతియందు వీణను ధరించి యొకచోటునుంచి యింకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచు పోవువారు.
చోల్కరు చక్కరలేని తేనీరు
పూనా అహమ్మదునగరు జిల్లాలో బాబాను గూర్చి యందరికి తెలియును. గాని నానాసాహెబు చాందోర్కరు ఉపన్యాసముల వల్లను, దాసుగణు హరికథలవల్లను, బాబా పేరు కొంకణదేశమంతయు ప్రాకెను. నిజముగా దాసుగణు తన చక్కని హరికథలవల్ల బాబాను అనేకులకు పరిచయ మొనర్చెను. హరికథలు వినుటకు వచ్చినవారికి అనేకరుచు లుండును. కొందరు హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు; కొందరికి వారి నటన; కొందరికి వారి పాటలు; కొందరికి హాస్యము, చమత్కారము; సంతసము గలుగజేయును. కథాపూర్వమున దాసుగణు సంభాషించు వేదాంతవిషయములు వినుటకు కొందరు; అసలు కథలు వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చినవారిలో చాల కొద్దిమందికి మాత్రమే భగవంతునియందుగాని, యోగులయందుగాని, ప్రేమ-విశ్వాసములు కలుగును. కాని దాసుగణుయొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావ మతిసమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట నొక యుదాహరణము నిచ్చెదము.
ఠాణాలోనున్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసుగణు మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకువచ్చిన వారిలో చోల్కర్ యనునతడుండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. దాసుగణు కీర్తన నతిజాగ్రత్తగా వినెను. వాని మనస్సు కరగెను. వెంటనే అక్కడనే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. "బాబా! నేను పేదవాడను, నాకుటుంబమునే నేను పోషించుకొన లేకున్నాను. మీ యనుగ్రహముచేత సర్కారు వారి పరీక్షలో నుత్తీర్ణుడనై ఖాయమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీ వచ్చెదను. మీ పాదములకు సాష్టాంగనమస్కారము చేసెదను. మీ పేరున కలకండ పంచిపెట్టుదును." వాని యదృష్టముచే చోల్కరు పరీక్షలో పాసయ్యెను. ఖాయమైన యుద్యోగము దొరికెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో నంత బాగుండు ననుకొనెను. చోల్కరు బీదవాడు. వాని కుటుంబము చాల పెద్దది. కనుక షిరిడీయాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. అందరికి తెలిసిన లోకోక్తి ప్రకార మెవరైన పర్వతశిఖరమునై న దాట వచ్చునుగాని బీదవాడు తన యింటి గడపనే దాటలేడు.
చోల్కరున కెటులైన శ్రీ సాయి మ్రొక్కును త్వరలో చెల్లించ వలెనని యాతురుత గలిగెను. కావున తన సంసారమునకగు ఖర్చులను తగ్గించి కొంతపైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని యా మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఇవ్విధముగా కొంత ద్రవ్యము మిగిల్చిన పిమ్మట, షిరిడీ వచ్చి బాబా పాదములపై బడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మ్రొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. బాబాతో తాను సంతసించినట్లు తన కోరికలన్నియు నానాడు నెరవేరెననియు చెప్పెను. చోల్కరు బాపుసాహెబు జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును బిలచి యిట్లనెను. "నీ యతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి యిమ్ము." ఈ పలుకులలోని భావమును గ్రహించినవాడై, చోల్కరు మనస్సు కరగెను. అతడాశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై బడెను. జోగు కూడ ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర యెక్కువగా కలుపుట యనుదాని భావము ఏమైయుండునా యని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి, నమ్మకములను కలుగ జేయ వలెనని యుద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియు, తేయాకునీళ్ళలో చక్కెర నుపయోగించక పోవుట యను రహస్యమనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియు చెప్పెను. బాబా యిట్లు చెప్పనుద్దేశించెను. "నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. శరీరముతో నేనిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీ కిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాసస్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజనహృదయములందుగల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు; పావనులు; అదృష్టవంతులు."
బాబా చోల్కరు కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో గదా!
రెండు బల్లులు
ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని యుండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని యుండెను. ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికెను. కుతూహలమునకై యా భక్తుడు బల్లి పలికినదాని కర్థమేమని బాబా నడిగెను. అది శుభశకునమా, లేక యశుభమా యని ప్రశ్నించెను. చెల్లెలు ఔరంగాబాదునుండి తనను చూచుటకు వచ్చునని యాబల్లి యానందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికినదానిని అతడు గ్రహించలేకుండెను. వెంటనే ఔరంగాబదునుండి యెవరో గుఱ్ఱముపై సాయిబాబా దర్శనమునకై షిరిడీ వచ్చిరి. అతడింకను కొంతదూరము పోవలసియుండెను. కాని వాని గుఱ్ఱము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుఱ్ఱమునకు ఉలవలు కావలసియుండెను. తన భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు తీసికొని వచ్చుటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను. అందులో నుండి యొకబల్లి క్రిందపడి యందరు చూచుచుండగా గోడ నెక్కెను. ప్రశ్నించిన భక్తున కదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే యా బల్లి తన చెల్లెలువద్దకు సంతోషముతో పోయెను. చాలకాలము పిమ్మట అక్కచెల్లెండ్రు కలిసికొనిరి. కాన ఒకరి నొకరు కౌగిలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచు నధిక ప్రేమతో నాడిరి. షిరిడీ యెక్కడ? ఔరంగాబాదెక్కడ? గుఱ్ఱపురౌతు ఔరంగాబాదునుంచి బల్లిని తీసికొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే యిద్దరు అక్కచెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే యెట్లు చెప్పగలిగెను? ఇది యంతయు బహుచిత్రముగా నున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది.
ఉత్తర లేఖనము
ఎవరయితే యీ అధ్యాయమును భక్తిశ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నియు శ్రీ సాయినాథుని కృపచే తొలగును.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
పదునైదవ అధ్యాయము సంపూర్ణము.
రెండవరోజు పారాయణము సమాప్తము.
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
V. Rama Aravind.
2009-01-20.
Posted on: 2009-01-31.
Last updated on: 2011-11-05.
|